జీవో నెంబర్‌ 3 పునరుద్ధరణకు ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్సి నిర్వహించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 మే, 2025.

 

ఏజెన్సీలో జీవో నెంబర్‌ 3 పునరుద్ధరణకు ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్సి నిర్వహించాలని, అప్పటివరకు ఏజెన్సీలో డీఎస్సీ రిక్రూట్మెంట్లు వాయిదా వేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో మూడు ఆప్షన్‌లను పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందులో 100% రిజర్వేషన్లు కల్పించడం మినహా మరో ఆప్షన్‌ లేదు. మిగతా ఇతర ఏ ఆప్షన్‌ తీసుకున్నా అది గిరిజన నిరుద్యోగులకు అన్యాయం చేయటం అవుతుంది. ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా, ఇటీవల అరకు సందర్శనలలోనూ జీవో నెంబర్‌ 3 ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా సాంకేతిక లోపాలను సవరించి తిరిగి న్యాయవివాదానికి చోటులేని విధంగా పాత జీవో స్థానంలో కొత్త ఆర్డినేషన్‌ తీసుకురావాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేసింది. దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగియనున్నందున ఈ సమస్యను అత్యవసరంగా భావించి చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీలో అప్పటిదాకా డీఎస్సీ వాయిదా వేసి తదుపరి స్పెషల్‌ డిఎస్సి నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి