మురళీనాయక్ సహా అమర సైనికులు, పౌరుల మృతికి సిపిఐ(యం) నివాళి:
ప్రజాశక్తితో వి.శ్రీనివాసరావు
ఉగ్రవాదంపై పోరులో అసువులు బాసిన మురళీనాయక్ సహా అమర సైనికులు, పౌరులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ శ్రద్దాంజలి ఘటించింది. ఉగ్రవాదంపై పోరుకు సిపిఎం పూర్తి మద్దతు ఇచ్చిందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశాలనంతరం నేడు తనను కలిసిన ప్రజాశక్తి ప్రతినిధితో మాట్లాడుతూ ఉగ్రవాదంపై యుద్ధానికి మతం రంగు పులమడం ప్రమాదకరమని, దేశ ఐక్యతకు విఘాతమని చెప్పారు. అదే సమయంలో దీన్ని రెండు దేశాల మధ్య యుద్ధంగా మార్చడం కూడా సరైనది కాదని, ఉగ్రవాదం పై పోరును భారతదేశ ప్రజలందరినీ ఐక్యపరిచి, పాకిస్థాన్‌ను ఒంటరిపాటు చేసి జరపవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందాన్ని సిపిఎం స్వాగతించిందని చెప్పారు.
నారాయణపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అనుచితం:
ఈ సందర్భంగా సిపిఐ అఖిల భారత నాయకులు కె.నారాయణపై బీజేపీ నాయకుల విమర్శలను ప్రస్తావించగా, సోము వీర్రాజు బాధ్యతారహిత్యంగా సిపిఐ నాయకులపై నోరు పారేసుకోవడం సముచితం కాదన్నారు. యుద్ధం వద్దన్నందుకే నారాయణను పాకిస్తాన్ పొమ్మన్న బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రభుత్వమే కాల్పుల విరమణ చేసినందుకు ప్రజలకు ఏమి చెబుతారని ప్రశ్నించారు. యుద్ధం వద్దన్న దేశ ప్రజలు ద్రోహులైతే.. అమెరికా అధ్యక్షుడి ఆజ్ఞలకు తలొగ్గి పాకిస్తాన్‌తో రహస్య ఒడంబడిక చేసుకున్న మోడీ, బీజేపీ నాయకులను ఏమనాలని ప్రశ్నించారు. ఇప్పటికీ పహాల్గమ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకోలేదని గుర్తు చేసారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు నమ్రతతో, బాధ్యతగా, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని కోరారు.