
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 07 మే, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : కొల్లేరు శాశ్వత పరిష్కారం కోసం 3వ కాంటూరు వరకు కుదించి, ఎకో సెన్సిటీవ్ జోన్‌ను 3వ కాంటూరుకు పరిమితం చేయాలని కోరుతూ...
అయ్యా!
కొల్లేరును 3వ కాంటూరు నుండి 5వ కాంటూరుకు విస్తరింపచేయడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మీరు కొల్లేరు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని, 2014లో ప్రధాని మోడీ భీమవరం వచ్చిన సందర్భంగా మీ సమక్షంలో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. పర్యావరణం, పక్షుల ఆవాసానికి కొల్లేరు నిలయం అనడంలో సందేహం లేదు. అదే క్రమంలో అనేక వందల సంవత్సరాలుగా చేపల వేట ప్రధాన వృత్తిగా కొల్లేరులో జీవనాన్ని సాగిస్తున్న బిసి, ఎస్సీ, ఇతర పేద కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరించడం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమస్యపై సుప్రీంకోర్టులో సాగుతున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని, తక్షణం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిపి ప్రభుత్వం కొల్లేరు ప్రజలను ఆదుకోవడానికి శాశ్వత పరిష్కారానికై చొరవ చేయాలని కోరుతున్నాను.
గతంలో మీ హయంలోనే 1999లో కొల్లేరును 5వ కాంటూరుకు విస్తరింపచేస్తూ జి.వో. నెంబర్ 120 తీసుకువచ్చారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆ జి.వో.ను ఆపరేషన్ కొల్లేరు పేరుతో ప్రభుత్వం ఇచ్చిన సొసైటీలు, జిరాయితీ భూముల్లోని చేపల చెరువులను విధ్వంసం చేసి అమలు చేయడంతో కొల్లేరు ప్రజల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. వారి జీవితాలు తిరిగి యధావిధిగా కొనసాగాలంటే కొల్లేరును 5 నుండి తిరిగి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉపాధి కల్పించాలని, సొసైటీలు, జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగులు భూములు కొల్లేరు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను. ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రాంతంలో పర్యటించిన రాజకీయ పార్టీల నాయకులు కొల్లేరు ప్రజలను ఆదుకుంటామని, వారికి రక్షణగా ఉంటామని వాగ్ధానాలు చేశారు. కాని ఆ వాగ్ధానాలను అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత పరిస్థితుల వలన కొల్లేరు ప్రజల ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతినడంతో ఇప్పటికే అనేక మంది దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.
అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, జస్టిస్ మిత్రా కమిటీ, శ్రీరామకృష్ణయ్య కమిటీల సిఫార్సులను అమలు చేయాలని కోరుతున్నాను. కొల్లేరు కాలుష్యానికి అక్కడి ప్రజలు కారణం కాదని అటు కృష్ణా, ఇటు ఏలూరు జిల్లాల పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్ధాలు, మురుగు డ్రైన్ల వలనే కొల్లేరు కాలుష్యామౌతోందని అనేక నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. కాలుష్య నివారణకు రెగ్యులేటర్లు నిర్మించాలని, కొల్లేరు వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, కొల్లేరులోకి వచ్చే మురుగు డ్రైన్లు బాగు చేయాలని, ఆధునీకరించాలని, పూడిక తీయాలని, తుమ్మ, కిక్కిస, గుర్రపుడెక్క తొలగించాలని (ఛానలైజేషన్), అందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞాప్తి చేస్తున్నాను. కొల్లేరులో పెనుమాకలంక తదితర గ్రామాల్లో కరకట్టలు లేకపోవడంతో వరద నీరు గ్రామాలపైకి వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా కొల్లేరు ప్రజలకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నాను. కొల్లేరు పక్షులను, కొల్లేరు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కొల్లేరు ప్రజలను రక్షించుకోవడం, వారి ఉపాధిని కాపాడటం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నాను. ఇకనైనా అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, భీమవరంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేలా కొల్లేరును 5వ కాంటూరు నుండి 3వ కాంటూరుకు కుదించి, అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పర్యావరణ సున్నిత ప్రాంత (ఎకో సెన్సిటీవ్ జోన్) పరిధి కాంటూరు 3 లోపుకు పరిమితం చేసేలా కేంద్రం, పర్యావరణ మంత్రిత్వ శాఖ తగు చర్యలు తీసుకునేలా మీరు, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి