
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 మే, 2025.
యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలి
యూనిట్ విద్యుత్‌ను రూ.4.60లు చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్ కంపెనీతో రాష్ట్ర డిస్కామ్‌లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రజలపై పాతికేళ్ళపాటు రూ.15 వేల కోట్లు భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపిఈఆర్‌సి) ఆమోదముద్ర వేయడం అన్యాయం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం (2003)లోని 108వ సెక్షన్‌ను ప్రయోగించడం గర్హనీయం.
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ నుండి యూనిట్ విద్యుత్‌ను రూ.4.60లు చొప్పున కొనుగోలు చేసేందుకు ఏపిఎస్‌పిడిసిఎల్ చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఏపిఈఆర్‌సి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాతికేళ్ళపాటు 400 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ద్వారా యాక్సిస్ కంపెనీకి రూ.15 వేల కోట్లు పైగా లబ్ది కలుగుతుంది. గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే 2018లో ఈ దోపిడీకి ప్రయత్నించగా ప్రభుత్వం మారాక కోర్టుల చుట్టూ తిరిగింది. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యాక్సిస్ కంపెనీ పాత ప్రతిపాదనను డిస్కామ్ ఆమోదించింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం (2003)లోని సెక్షన్ 108 కింద రిఫర్ చేయడం ద్వారా ఏపిఈఆర్‌సి కూడా ఆమోదముద్ర వేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని కల్పించింది. రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపి, యాక్సిస్ కంపెనీకి కట్టబెట్టడానికి టిడిపి కూటమి ప్రభుత్వం చేయించిన ఈ ఒప్పందం ఎంతమాత్రమూ అనుమతించరానిది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనిట్ రూ.2 లు, 2.50లకి ఒప్పందాలు జరుగుతున్నాయి. గతంలో అదానీ సంస్థతో సెకీ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2.49లు ఒప్పందం చేసుకోగా అది అధిక రేటు అని తెలుగుదేశంతో సహా అన్నిపక్షాలు విమర్శించాయి. నేడు దానికంటే రూ.2.10లు అధికంగా చేసే ఒప్పందాలు చేసుకోవడం గర్హనీయం. సోలార్ ప్యానెల్స్, ఇతర ఉత్పాదకాల ఖర్చు భవిష్యత్తులో ఇంకా తగ్గే వీలున్నందున విద్యుత్ రేట్లు ఇంకా తగ్గుతాయి. ఆ ప్రయోజనం కూడా వినియోగదార్లకు దక్కకుండా రూ.4.60లు రేటుకు పాతికేళ్ళు కొనసాగేలా యాక్సిస్‌తో ఒప్పందం చేయడం దారుణం. అన్ని విధాలా నష్టదాయకమైన ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అందుకోసం ప్రజలు, విద్యుత్ వినియోగదార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తమ నిరసన తెలపాలనీ సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి