
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 మే, 2025.
భారీ వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
ఆదివారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పంటనష్టం జరిగిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మామిడి రైతుల్ని ఆదుకోవాలని, ఈదురుగాలులతో కూలిపోయిన పేదల గుడిశలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, పిడుగుపాటుకు మరియు చెట్టు కూలి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి సరైన పరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది. ఇలాంటి సందర్భాలలో రైతులకు ఉపయోగపడేలా పంటల బీమా పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించి అమలు చేయాలి.
నిన్న కురిసిన భారీ వర్షానికి రాష్ట్రవ్యాపితంగా అన్ని జిల్లాల్లో ధాన్యం, ఉధ్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. గోదావరి జిల్లాల్లో 50 వేల ఎకరాలు ధాన్యం నీటమునిగిందని, గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాలు ధాన్యంతో పాటు, మొక్కజొన్న, అరటి పసుపు పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వమే ప్రాథమిక అంచనా వేసింది. ఎన్‌టిఆర్, ఏలూరు, కడప, అన్నమయ్య జిల్లాలు చేతికొచ్చిన మామిడి పంట భారీ వర్షం, గాలులకు నేలకూలినట్లు ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. ఇది ప్రకృతి సృష్టించిన నష్టం అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది. చేతికొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేసినా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయడంలో వైఫల్యం చెందింది. ఉదా: కాకినాడ జిల్లాల్లో 6 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ కొనుగోలు చేసింది కేవలం 4.40 లక్షల టన్నులు మాత్రమే. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.1 లక్ష, ఆహారపంటకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ఈదురుగాలులతో కూలిపోయిన గుడిశలకు రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి