ఈరోజు (28 ఏప్రిల్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
పేదల ఇళ్ల కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి
సిఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి
ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఉండిలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి
కోర్టు స్టే ఉన్న ఇళ్లనూ కూల్చివేశారు
ఎమ్మెల్యే తానే ఇళ్లు కూల్చమన్నానని చెప్పడం అన్యాయం
ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని వాటిని నిలువరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఒక ఎమ్మెల్యే తానే ఇళ్లను కూల్చివేయమన్నానని చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని, ఇళ్లను కూల్చివేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందా అదన్నా చెప్పాలని డిమాండు చేశారు. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, కె.సుబ్బరావమ్మతో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. 15 రోజుల్లో మిగతా ఇళ్లను కూడా కూల్చేస్తామన్న రఘురామరాజును నియంత్రించాలని కోరారు. 40 ఏళ్లకుపైబడి పేదలు అక్కడే నివాసం ఉంటున్నారని, వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కాలువ నీళ్లు కలుషితం అవుతున్నాయని,అందువల్లే కూల్చివేశామని చెబుతున్న మాటలో ఏ మాత్రమూ నిజము లేదని, ఇళ్లు కూల్చివేసిన ప్రాంతంలో వెళుతున్న కాలువ అత్యంత శుభ్రంగా ఉందని పేర్కొన్నారు. కాలనీ ఎదురు కాలువ నీటిని ఎవరు కూడా పరీక్షించి నిర్థారించలేదన్నారు. భూస్వాముల కోర్కెలపై ఎలా ఇళ్లు కూల్చివేస్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు సైతం ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా పేదలను ఖాళీ చేయించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆక్వా చెరువుల్లో నుండి వెళ్లే డ్రెయిన్లు అత్యంత ప్రమాదకరమైన కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని, యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారంగా మారిందని తెలిపారు. వాటిని నిలువరించకుండా శాస్త్రీయ పరమైన నిరూపణలు లేకుండా పేదలను అక్కడ నుండి తరిమేయడం అన్యాయమని చెప్పారు. పేదల ఇళ్ల డ్రెయినేజీ నీరు కులస్తుందని భావిస్తే ప్రత్యేక డ్రెయినేజీ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆపనిచేయలేదని తెలిపారు. పాలకోడేరులో 110 ఇళ్లు ఉంటే 65 మందికి వేరే ప్రాంతంలో స్థలాలు ఇచ్చారని వారిట్లో కొన్ని స్థలాలపై భూయజమాని కోర్టును ఆశ్రయించారని, 45 మంది అసలు నిర్మించుకోలేదని అన్నారు. స్థలాలు ఇచ్చిన వారికి కూడా ఆర్థిక సహకారం అందించలేదన్నారు. పదిమంది మాత్రమే ఇల్లు కట్టుకున్నారని, మిగిలిన వరాఉ నిరాశ్రయులన్నారు. ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయకపోవడంతో ఇళ్లు కోల్పోయిన వారందరూ రోడ్లపైనే ఉంటున్నారని, సిపిఎం శిబిరంలో వారికి భోజన వసతి కల్పించామని పేర్కొన్నారు. ప్రజల ఆమోదంతో ఇళ్లు కూల్చివేశామని స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు చెబుతున్నాడని, ఇళ్లు కోల్పోయిన వారందరూ ప్రజలు కాదా అని ప్రశ్నించారు. ఆయన దృష్టిలో వారెవరో చెప్పాలని కోరారు. సిపిఎం ప్రజల తరుపున నిలబడుతుందని, వారికి ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడుతుందని తెలిపారు. నిజంగా పేదలను తరలించాలనుకుంటే ఇళ్లు నిర్మించి సదుపాయాలు కల్పించి తరలించాలని, రోడ్డుపై పడేయం ఏం న్యాయమని ప్రశ్నించారు. పైగా మగ పోలీసులు మహిళలను జుట్టుపట్టుకు ఈడ్చారని, కొంతమంది సొమ్మసిల్లిపోయారని అన్నారు. తరలించిన ప్రాంతంలో 52 ఇళ్లకు స్టే ఉందని, వాటిల్లో మూడు ఇళ్లను కూల్చివేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అన్నారు. పైగా బాధ్యతాయుత డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణంరాజు తానే కూల్చమన్నానని చెప్పడం పూర్తి నియంతృత్వమని అన్నారు. స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు హుందాగా వ్యవహరిస్తుంటే డిప్యూటీ స్పీకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ప్రభుత్వానికి కూడా మంచిది కాదని తెలిపారు. వెంటనే ఇళ్ల కూల్చివేత ప్రక్రియను నిలిపివేయకపోతే సిపిఎం ఆధ్వర్యాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నెలరోజుల్లో పునరుద్ధరించాలని తాము కోరితే 15 రోజుల్లో మిగిలిన ఇళ్లనూ కూల్చివేస్తామని స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చెబుతున్నాడని, దీనిపై ప్రభుత్వం స్పందించి వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకున్నవారికి పట్టాలిస్తామని లోకేష్ చెబుతున్నారని, రఘురామకృష్ణంరాజు మాత్రం కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కూల్చివేతలపై చర్యలు తీసుకోవాలని, అందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో ఇళ్ల తొలగింపు సందర్భంగా మహిళలను మగ పోలీసులు పక్కకు నెట్టడాన్ని, కాలుష్యాన్ని వెదజల్లుతున్న కాలువ వీడియోలను ప్రదర్శించారు.
డిప్యూటీ స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నాను
శ్రీనివాసరావు క్షమాపణ చెబితే తాను క్షమాపణ చెబుతానని రఘురామకృష్ణంరాజు అన్నమాటపై వ్యాఖ్యానిస్తూ రఘురామకృష్ణం రాజు తనకు క్షమాపణ చెప్పాలని తాను ఎక్కడా డిమాండు చేయలేదని, ఖడబ్దార్ అని కూడా అనలేదని తాను అనని మాటలను తననోట్లో పెట్టి క్షమాపణ చెబితే తాను చెబుతాననడం విజ్ఞత అనిపించుకోదన్నారు. పేదల ఇళ్లు కూల్చివేయడం ద్వారా ఈ సమస్యను ప్రారంభించిందే రఘురామకృష్ణంరాజని ఆయన ఏం చేస్తారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈ సమస్య శ్రీనివాసరావు, రఘురామకృష్ణంరాజు మధ్య వ్యక్తిగత వివాదం కాదని, పేద ప్రజల హక్కులకు సంబంధించిన అంశమని అన్నారు. ఇళ్లు కూల్చివేతలను ఆపాలని మరోసారి డిమాండు చేశారు. అక్రమంగా ఇల్లు కొట్టివేతపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మహిళలపై దౌర్జన్యం చేసిన మగ పోలీసులపై చర్యలు తీసుకోవాలి: సుబ్బరావమ్మ
ఉండి నియోజవకవర్గం పాలకోడేరులో ఇల్లు ధ్వంసానికి అడ్డంపడ్డ మహిళలపై మగ పోలీసులే నిర్థాక్షిణ్యంగా దాడి చేయడంపై చర్య తీసుకోవాలని కోరారు. రఘురామకృష్ణంరాజు ఆయన పేరులో రాజు ఉండటంతో రాజుననుకుని, రాజరికాలు ఉన్నాయనుకుని విర్రవీగుతున్నాడని మాటలు అదుపులో ఉంచుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ హెచ్చరించారు. ఆయన మాటల్లో ఏ మాత్రమూ మర్యాద లేదని, డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన అర్హుడు కాదని అన్నారు. రాజరికం పద్దతులు అనుసరిస్తాం, నోటికొచ్చినట్లు మాట్లాడుతాం అంటే ఊరుకునేది లేదని అన్నారు.
గిరిజన ప్రత్యేక డిఎస్‌సికి ఆర్డినెన్స్
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండు
ప్రభుత్వం జిఓ నెంబరు 3ను పునరుద్ధరించాలి
2వతేదీన గిరిజనుల బంద్‌కు సిపిఎం మద్దతు
రాష్ట్రంలో గిరిజన ప్రాంత నిరుద్యోగులకు కోసం ప్రత్యేక డిఎస్‌సి నిర్వహణకు ఆర్డినెన్స్ తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండు చేశారు. సోమవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, కె.సుబ్బరావమ్మతో కలిసి ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల పర్యటన సమయంలో జిఓ నెంబరు 3న పునరుద్దరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చారని దీన్ని నిలబెట్టుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలను నూటికి నూరుశాతం గిరిజనులకే ఇవ్వాలని, కానీ మైదాన ప్రాంతంలో ఉండేవారిని తీసుకెళ్లి షెడ్యూలు 5 ప్రాంతంలో ఉద్యోగాలు ఇస్తోందని తెలిపారు. 1200 మందిని తొలగించి వారిస్థానంలో గిరిజనేతరులను తీసుకెళ్లి నియమిస్తోందని తెలిపారు. కేటగిరైజేషన్ కోసం డిఎస్‌సి వాయిదా వేశామని చెప్పారని, గిరిజనులను వారి ప్రాంతంలో నియమించేందుకు ఎందుకు కేటగిరీ చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో వారంతా గందరగోళ పడుతున్నారని, మే2వ తేదీన బంద్‌కు పిలుపు ఇచ్చారని తెలిపారు. వారి బంద్‌కు 2వ తేదీన సిపిఎం మద్దతు ఇస్తుందని వివరించారు. గిరిజన ప్రాంతంలో పదివేలమంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటే అందులో 1600 పోస్టులు అక్కడ ఉన్నాయని తెలిపారు. వాటిని పూర్తిగా గిరిజనులకు ఇవ్వకుండా బయట ప్రాంతాల వారికి ఇవ్వడం షెడ్యూలు 5 ప్రకారం వారికున్న హక్కులను కాలరాయడమేనని అన్నారు. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. జిఓ 3 పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదని వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎన్నికలు అయిన తరువాత మర్చిపోయారని అన్నారు. వెంటనే జిఓను పునరుద్ధరించడంతోపాటు గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని కోరారు.