(ఈరోజు (27 ఏప్రిల్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
రాజధాని నిర్మాణానికి ప్రధాని అప్పు స్థానంలో గ్రాంటు ప్రకటించాలి
విభజన చట్టం అమలుపై స్పందించాలి
సిపిఎం డిమాండ్
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రాంటుగా ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2వ తేదిన విచ్చేస్తున్న సందర్భంగా మోడీకి సిపిఎం రాష్ట్రకమిటీ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం విడుదల చేశారు.అనంతరం వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన 10ఏళ్లల్లో రాష్ట్ర రాజధాని విషయంలో బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, ఇస్తానన్న గ్రాంట్లు ఇవ్వలేదన్నారు. రాజధాని బాధ్యత కేంద్రప్రభుత్వానిదే అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, కేవలం రూ.1500కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి 2015లో విచ్చేసిన నరేంద్రమోడీ ఆర్బాటంగా నీళ్లు, మట్టి తెచ్చి ఎంతో గొప్పగా చెప్పారని అన్నారు. మళ్లీ రాజధాని పనులు పున:ప్రారంభానికి మోడీ వస్తుండటంతో ప్రజల్లో అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేసిన సమయంలో కోర్టులో వివాదం నడిచిందని, ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కనీసం నోరుకూడా మెదపలేదన్నారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. రాజధాని ఇలా నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం కేంద్రప్రభుత్వమని అన్నారు.
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిని లక్ష కోట్లతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు.ఈ లక్ష కోట్లలో కేంద్రప్రభుత్వం ఎన్ని నిధులు ప్రకటిస్తారో ప్రజలు ఎదురుచూస్తున్నారని, దీనిపై బహిరంగ మోడీ ప్రకటన చేయాలని కోరారు. లేదంటే రాజధాని నిర్మాణానికి అయ్యే లక్ష కోట్ల భారం రాష్ట్రప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు, హడ్కోల నుంచి రూ.31వేల కోట్లు అప్పు రూపంలో ఇప్పిస్తామని ప్రకటన చేశారని చెప్పారు. గతంలో లాగాఈ సారి కూడా నీరు,మట్టి తెచ్చి నిర్లక్ష్యం చేస్తారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కడప స్టీల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపులపై కూడా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు రైతులు ఇచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని రైతులు వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.మరలా మరో 44వేల ఎకరాలు భూసమీకరణలో విధానంలో సేకరిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయని, దీనిపై కూడా రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాజధానికి మోడీ శంకుస్థాపన చేసి 3,475 రోజులు గడిచిందని చెప్పారు. గతంలో మోడీ వస్తే నిధులు వస్తాయని ప్రజలు ఆశిస్తే చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తెచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లారని చెప్పారు. కనీసం ఇప్పుడైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన వివక్షత, చిన్నచూపును విడనాడి రాష్ట్రం, రాజధాని అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజధానికి నిధులు పొందడం రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పారు. మోడీ తన పర్యటనలో నిధులపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
విభజన చట్టం సెక్షన్ 94 (3) ప్రకారం రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే అని చెప్పారు. గత పదేళ్ల కాలంలో రూ.60వేల కోట్లు నిధులు అడిగితే రూ.1500 కోట్లతో సరిపెట్టారని, ఇప్పుడు రూ.1లక్ష కోట్లు అడిగితే రూ.1400కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో డబుల్, త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అని చెబుతున్న చంబ్రాబు, పవన్ కళ్యాణ్ మాటల్లో కాకుండా చేతల్లో నిధులు సాధించి చూపించాలని అన్నారు. నిధుల కోసం కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం నుంచి ఒత్తిడి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
పదేళ్ల నుంచి రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం నుంచి రాజధానికి రావాల్సిన నిధులు కోరడంలో, పొందడంలో, ఒత్తిడి చేయడంలో విఫలమయ్యాయని, ఇప్పుడైనా ఆ పనిచేయాలని కోరారు. రాజధానిలో సుమారు 41 కేంద్రప్రభుత్వ సంస్థలకు 300 ఎకరాలకు పైగా స్థలాలు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా పూర్తికాలేదన్నారు. వీటి నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, అందుకు కావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి, విశాఖ ఉక్కు, కడప ఉక్కులపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, తద్వారా రాష్ట్రానికి, రాజధానికి ఉపయోగం ఉంటుందన్నారు. రాజధానిలో రైతులు, కూలీలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రీతిలో మోడీ వ్యవహరించాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులు వై నేతాజీ, రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి పాల్గన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు సరికావు
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిపిఎం, ఆ పార్టీ కార్యదర్శిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బాబూరావు ఖండిరచారు.ఉండి నియోజకవర్గంలో సుమారు 900 ఇళ్లను కూల్చేయడంతో పేదలు రోడ్డున పడ్డారని, వీటిని తానే కూల్చినట్లు రఘురామకృష్ణంరాజు ప్రకటించారని తెలిపారు. కూల్చివేతలకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న పేదలకు సిపిఎం అండగా నిలబడిరదన్నారు. అధికారంలోకి తెచ్చిన పేదల ఇళ్లను కూల్చడం ఏమిటని అడిగిన నేరానికి అసభ్య, అనుచిత పదజాలంతో దుర్బాషాలకు దిగారని చెప్పారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడటం సరికాదన్నారు.తాము సభ్యతగా వ్యవహరిస్తామని టిడిపి చెప్పిందన్నారు. ఆ పార్టీకి చెందిన రఘురామకృష్ణంరాజు అనుచిత వాఖ్యలపై స్పందించి, అదుపు చేయాల్సిన బాధ్యత టిడిపి అధినాయకత్వంపై ఉందన్నారు. అక్రమ తొలగింపులు ఆపి పేదలకు న్యాయం చేయాలని కోరారు.