
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 09 ఏప్రిల్, 2025.
పట్టణాలలో పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలి.
ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలి. - సిపిఐ(యం)
2025`26 సంవత్సరాలకు సంబంధించి పట్టణాలలో ఆస్తి పన్ను గత సంవత్సరంతో పోలిస్తే 15%, 2020-21 సంవత్సరాలతో పోల్చితే 30% పన్ను పెంచుతూ, గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనివలన 320 కోట్ల రూపాయల భారం పట్టణ ప్రజలపై పడుతుంది. ఎన్నికలలో కూటమి పార్టీలు ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్నులు పెంచబోమని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట తప్పింది. గత వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టి చట్ట సవరణ చేసింది. జీవో 198 విడుదల చేసింది. గత వైసిపి ప్రభుత్వ బాటలోనే కూటమి ప్రభుత్వం నడుస్తూ ఇంటి పన్నులు పెంచింది. గత ఐదు సంవత్సరాల్లో సుమారు 100% పన్ను పెరిగింది. ఇది ఇంటి యజమానుల మీదే కాకుండా అద్దెదారులపైన పరోక్ష ప్రభావం పడుతుంది. పట్టణాలలో పౌర సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు పన్నుల పెంపుపై దృష్టి పెట్టడం తగదు. హామీ ఇచ్చిన విధంగా ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలి. పెంచిన ఇంటి పన్నును ఉపసంహరించాలి. పెంచిన పన్నుకు వ్యతిరేకంగా పట్టణ ప్రజలు సంఘటితంగా ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి