విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని కోరుతూ

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 ఏప్రిల్‌, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం  : విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని కోరుతూ...
అయ్యా!
విశాఖపట్నం నగరంలోని రుషికొండపై గత ప్రభుత్వం నూతనంగా నిర్మించిన అతిథి గృహం నిర్వహణపై రాష్ట్ర కేబినేట్‌ చర్చల్లో డిస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు ఇవ్వాలని, సుప్రీం కోర్టు బెంచ్‌ పెట్టడానికి కేంద్రాన్ని కోరాలని రకరకాల ఆలోచనలు చేస్తున్నట్లు పత్రికలలో వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి ఏం చేయాలో చెబితే మంత్రి మండలి నిర్ణయించబోతున్నట్లు తెలిసింది. ఈ అంశంపై నేను గత సంవత్సరం నవంబర్‌ 16న మీకు ఒక ఉత్తరం రాశాను.
గత ప్రభుత్వం విలాసవంతమైన ఈ భవనాన్ని నిర్మించడానికి సుమారు రూ.500 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం ప్రజలకే ఉపయోగపడాలి. ఆ రీత్యా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు స్వేచ్చగా భవనంలోకి అడుగుపెట్టి చూడడానికి అవకాశం కల్పించాలి. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదు, బెంగళూరు తరహాలో విజ్ఞానవంతమైన సైన్సు మ్యూజియం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేదు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంను ఈ భవనంలో ఏర్పాటు చేస్తే విద్యార్ధులకు, యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఇందుకవసరమైన నిధులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. తద్విరుద్దంగా సంపన్నుల విలాసాలకు దీన్ని వినియోగిస్తే అది ప్రజాతీర్పును ఉల్లంఘించడమే అవుతుంది.
కావున పై సూచనను గమనంలో ఉంచుకొని గత ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదమైన ఈ భవనాన్ని మీ ప్రభుత్వ హయాంలో అర్థవంతంగా మార్చగలరని కోరుతున్నాను.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org