బయెగ్యాస్‌ ప్లాంట్లపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. -సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఏప్రిల్‌, 2025.

బయెగ్యాస్‌ ప్లాంట్లపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి.
                                        -సిపిఐ(యం) డిమాండ్‌
        రాష్ట్రంలో రిలయన్స్‌ కంపెనీ పెట్టనున్న 500 బయోగ్యాస్‌ ప్లాంట్లపై
ప్రజలకు వాస్తవాలు నివేదించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని
డిమాండ్‌ చేస్తున్నది. 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి
కల్పిస్తామని ప్రకటించింది. 5 లక్షల ఎకరాల భూమి సేకరించనుంది. ఈ ప్లాంట్ల
కంపెనీకి వచ్చే లాభమెంత? అందులో రైతులకు దక్కేదెంత? తదితర వివరాలను రాష్ట్ర
ప్రభుత్వం సమగ్రంగా ప్రకటించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌
చేస్తున్నది.
1) లీజుల పేరుతో రైతుల నుండి తీసుకునే భూముల యాజమాన్యానికి భద్రత ఏమిటి?
దీనికి చట్టబద్ధత ఉందా?
2) ఆభూములపై ఆధారపడి జీవిస్తున్న పశువుల పెంపకందార్లు, వ్యవసాయ కూలీల
పరిస్ధితి ఏమిటి?
3) ఈప్లాంట్లలో తయారయ్యే మిథేన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌ వల్ల ఉత్పన్నమయ్యే
అనర్ధాల నుండి ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలకు భద్రత ఏమిటి?
4) కనిగిరి నియోజకవర్గంలో ఒక ప్లాంటుకు పెడుతున్న పెట్టుబడి 3`5 సం॥లలో
మొత్తం తిరిగి వస్తుంది. ఆ తర్వాత కంపెనీకి 100% లాభాలు ఉంటాయి.
రైతులకిచ్చే లీజు పెరుగుతుందా? అయితే ఎంత?
5) ప్రభుత్వ భూములకు లీజు ఎంత వసూలు చేస్తున్నారు.ప్రభుత్వ భూముల్ని తక్కువ
లీజు ఎలా వసూలు చేస్తారు?
6) రిలయన్స్‌ కంపెనీ బయోగ్యాస్‌ ప్లాంటుకి ప్రభుత్వం ఇస్తున్న
ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఏమిటి? పూర్తి వివరాలు ప్రకటించాలని సిపిఐ(యం)
డిమాండ్‌ చేస్తున్నది.
7) కంపెనీ తయారు చేసే గ్యాస్‌, ఎరువుల్ని భూములు కోల్పోయిన రైతులకు, ఉపాధి
లేని ప్రజలకు ఉచితంగా ఇస్తారా? రాష్ట్ర ప్రజలకు సబ్సిడిపై గ్యాస్‌
అందిస్తారా?
        బీడు భూముల్లో పంటలు పండటం లేదన్న నెపంతో రైతుల భూముల్ని కంపెనీ పరం చేయడం
అన్యాయం. చట్టవిరుద్ధం.  పి4 పేరుతో అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అంటే
ఇదేనా? ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి కార్పొరేట్‌ పరం చేయడమేనా అభివృద్ధి?
భూసేకరణ చేయకుండానే కేవలం కొద్ది మొత్తంలో లీజు చెల్లించి భూములపై ఆధిపత్యం
చెలాయించడానికి చట్టబద్ధత ఉందా? రైతులు శాశ్వతంగా భూములు కోల్పోయే ప్రమాదం
ఉంది. కంపెనీలు లీజు చెల్లించక పోతే రైతులు రోడ్డున పడతారు.
        ఇదే రిలయన్స్‌ కంపెనీ కృష్ణాపట్నంలో 20 సం॥ల క్రితం 2,500 ఎకరాలు తీసుకుని
ఏ ప్రాజెక్టు పెట్టలేదు. కాకినాడ, కోనసీమ జిల్లాలలో గ్యాస్‌
తవ్వితీస్తున్నా రిలయన్స్‌ స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించ లేదు. గ్రామాల
అభివృద్ధికి తోడ్పడలేదు. పైగా ప్రజలు కాలుష్యంతో నానా ఇబ్బందులు పడుతున్నది
వాస్తవం కాదా ప్రభుత్వం చెప్పాలి. గ్యాస్‌పై ఆధిపత్యం వహిస్తున్న రిలయన్స్‌
రాష్ట్రానికి చౌకగా గ్యాస్‌ సరఫరా చేస్తుందా? అలా చేస్తే కనీసం
ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఉచిత గ్యాస్‌ ప్రజలకు అందించవచ్చు.
స్థానికులకు ఎంతమందికి ఉద్యోగాలిస్తారో ప్రకటించాలి. మన రాష్ట్ర వనరుల్ని
కొల్లగొట్టి రిలయన్స్‌కు లాభాలు కట్టబెట్టడం ఏమాత్రం న్యాయంగా లేదు.
అభివృద్ధి పేరుతో ప్రజల కళ్లు కప్పకుండా పూర్తి వాస్తవాలు ప్రకటించాలి.
        అనంత అంబానీకి ఇచ్చిన మాటను 30 రోజుల్లో అమలు చేసిన నారా లోకేష్‌ గారు
ప్రజలకిచ్చిన వాగ్దానాలను 300 రోజులవుతున్నా ఎందుకు అమలు జరపలేదో చెప్పాలి.
ఈ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పని చేస్తున్నదా లేక ప్రజల కోసమా అన్నది
స్పష్టమవుతుంది.
        ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించి, ప్రజల ఆస్తులకు రక్షణ
కల్పించాలని కోరుతున్నాను.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org