పార్లమెంటు సీట్లు పునర్విభజనపై టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరం

ఈరోజు (24 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

పార్లమెంటు సీట్లు పునర్విభజనపై 

టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరం

బిజెపి కుట్రలో భాగస్వామ్యం కావద్దు

డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం నష్టం

పార్లమెంటులో టిడిపి, జనసేన ఎంపిలు ప్రశ్నించాలి

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కూటమి పార్టీలు అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి హానికరమని, దీనిపై టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరమని చెప్పారు. టిడిపి, జనసేన పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్‌పై డిఎంకె ఏర్పాటు చేసిన సమావేశానికి మన రాష్ట్ర నుండి తప్ప దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అన్ని పార్టీలూ ఒక తాటిమీదకు వచ్చి హాజరయ్యాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని, పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గేందుకు దారితీస్తుందని తెలిపారు. మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మన రాష్ట్రంలో టిడిపి, జనసేన గోడమీద పల్లివాటంగా డ్యాన్స్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో వైసిపి హాజరుకాకపోయినా కనీసం లేఖ రాసిందని, కూటమి పార్టీలు ఆపని కూడా చేయకపోగా                                       ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నాయని తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ఆయా పార్టీల నాయకులు డీలిమిటేషన్‌పై ముందు పార్లమెంటులో లేవనెత్తాలని అన్నారని, అసలు జనసేన పార్టీ సభ్యులు లోక్‌సభలో ఎందుకు లేవనెత్తలేదో చెప్పాలన్నారు. అసలు డీలిమిటేషన్‌ లాభమో, నష్టమో అదన్నా స్పష్టం చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై మాట్లాడకుండా అసెంబ్లీలో 75 సీట్లు మహిళలకు పెరుగుతాయని చెబుతూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయని, అవి తగ్గుతాయా పెరుగుతాయా అదన్నా చెప్పాలన్నారు. జనాభా ప్రతిపదికన గనుక సీట్లు కేటాయిస్తే దేశంలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ లాంటి ఒకటీ రెండు రాష్ట్రాలకు తప్ప ఎక్కువ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల బిజెపి పాలిత రాష్ట్రాలకు ఉపయోగం తప్ప దేశంలో మరెవరికీ సీట్లు పెరగవని అన్నారు. దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభాను తగ్గించాయని, జనాభా ప్రాతిపదికన అయితే గనుక దేశాభివృద్ధికి తోడ్పడిన రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందని పేర్కొన్నారు. దీనికోసమే బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో టిడిపి, జనసేన సమర్థించే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. డీలిమిటేషన్‌ చేసేటట్లయితే ప్రస్తుతం పార్లమెంటులో ఎంత శాతం సీట్లు పెరుగుతున్నాయో రాష్ట్రాలకు కూడా అలాగే సీట్ల ప్రాతిపదికగా పెరుగుదల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని సీట్లు పెరగాలని తెలిపారు. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్లు పెరిగితే ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని, ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల ఉనికిని కూడా ఇది దెబ్బతీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని, దానికన్నా రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలు, వైసిపి హాజరై అభిప్రాయం చెప్పాలన్నారు. టిడిపి తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడిరదని, మోడీకి భయపడి మౌనం వహిస్తే దానివల్ల సీట్లు తగ్గితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వివరించారు. కూటమి పార్టీలు జగన్‌ రాసినట్లు కనీసం వారి అభిప్రాయాన్ని మోడీకి చెబుతూ లేఖ రాయాలని తెలిపారు. దీనిపై కూటమి పార్టీలు స్పందించకపోతే భవిష్యత్‌లో ఎపి ప్రయోజనాలను దెబ్బతీసినవారవుతారన్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి మతోన్మాద సర్వేను ఆపాలి

రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి మత విభజన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇంతకుముందు పంచాయతీరాజ్‌, సోషల్‌ వెల్ఫేర్‌ శాఖలు కూడా ఇదే తరహాలో చర్చీలు, మసీదుల వివరాలు సర్వేచేసి ప్రజావ్యతిరేకతతో వెనక్కు తగ్గిందని తెలిపారు. ఇప్పుడు విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రామాల్లో ఉన్న చర్చిలు, మసీదులు, దళితులు, ముస్లిముల జనాభా, తటస్థతంగా ఉన్న ఇతర మతస్తుల వివరాలపై సర్వే చేస్తున్నాయని తెలిపారు. ఇది ప్రమాదరకమైన చర్యని, దీన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. లౌకిక పార్టీ అని చెప్పుకుంటున్న టిడిపి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సర్వేను టిడిపి, జనసేన సమర్థిస్తాయా అంగీకరిస్తాయా లేదా స్పష్టం చేయాలని అన్నారు. మత సామరస్యం, దేశ సమైక్యత కోసం టిడిపి ఇటువంటి సర్వేలను నిరోధించాలని కోరారు.