పట్టణాలలో ఆస్తిపన్ను పెంపుదలకు సంబంధించి మున్సిపల్‌ సవరణ చట్టం 44/2020 రద్దు, ఆస్తిపన్ను పెంపు నిలిపివేయాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 23 మార్చి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : పట్టణాలలో ఆస్తిపన్ను పెంపుదలకు సంబంధించి మున్సిపల్‌ సవరణ చట్టం 44/2020 రద్దు, ఆస్తిపన్ను పెంపు నిలిపివేయాలని కోరుతూ...
అయ్యా!
గత ప్రభుత్వం పట్టణాలు, నగరాలలో ఆస్తిపన్ను మదింపు విధానాన్ని మార్చుతూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్టాలలో సవరణ చేస్తూ ఆర్డినెన్సు నెం.23.11.2020న ఆర్డినెన్సు నెం.16/2020ని విడుదల చేసింది. ఈ ఆర్డినెన్సును సవరణ చట్టం 44/2020గా అసెంబ్లీలో ఆమోదించారు. అప్పటి వరకు ఉన్న అద్దె విలువలపై ఆస్తిపన్ను (ఇంటిపన్ను) మదింపు చేసే విధానాన్ని మార్చుతూ, ఆస్తి కేపిటల్‌ విలువపై ఆస్తిపన్ను మదింపు చేసే విధానాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. దీనిని అమలు జరపడం కోసం రూల్సు రూపొందించి ఆర్డినెన్సు విడుదల చేసిన మరుసటిరోజే 24.11.2020న జి.వో.ఎం.ఎస్‌.నెం.198ని విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుండి 0.25% అదనపు అప్పుకు అనుమతి పొందడం కోసం ఈ చట్ట సవరణ చేశారు. కేవలం ఒకసారి మాత్రమే అప్పు పొందడం కోసం ప్రజలపై శాశ్వత భారాన్ని మోపే చట్ట సవరణను చేశారు. ఆనాడు రాష్ట్రవ్యాపితంగా ప్రజానీకం వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆనాడు వ్యతిరేకించింది. అధికారంలోకి వస్తే ఆస్తిపన్నును సమీక్షిస్తామని ఎన్నికలలో వాగ్దానం కూడా చేశారు. ఆస్తిపన్ను భారాన్ని తగ్గిస్తారని ప్రజలు ఆశించారు. కానీ నేటికీ సమీక్షించలేదు. అద్దె విలువపై పన్ను విధించడం సరైంది. అందుకు భిన్నంగా కేపిటల్‌ విలువపై పన్ను విధించడం ఇది సరైంది కాదు.
మరో విషయమేమంటే, కేపిటల్‌ విలువ అనేది రిజిస్ట్రేషన్‌ సమయంలో రిజిస్ట్రేషన్‌ విలువ నిర్ణయించడం కోసం ఈ విలువలను ప్రభుత్వాలు దాదాపు ఏటా పెంచుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇటీవలె పెంచింది. ఈ విలువకు ఆస్తిపన్నును లింకు చేయడం వలన ప్రభుత్వం ఆస్తులు మార్కెట్‌ విలువ పెంచిన ప్రతిసారీ ఆస్తిపన్ను కూడా పెరుగుతుంది. ప్రస్తుత ఆస్తిపన్ను ఏటా 15% చొప్పున పెంచుతున్నారు. 15% చొప్పున పెంచితేనే ఈ చట్టం వచ్చిన నాటి నుండి నేటికి ఆస్తిపన్ను 100% పెరిగింది. ఇది ఇంకా పెరుగుతుంది. నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేసినా, ఖాళీ స్థలాన్ని ఎవరికైనా అమ్మినా ఆనాటికున్న ఆస్తి కేపిటల్‌ విలువ (మార్కెట్‌ విలువ)పై పన్ను విధిస్తున్నారు. ఇది భారంగా మారుతున్నది.భవన అనుమతులు లేవనే సాకుతో ఆ భవనాలపై మరింత అదనంగా పన్ను విధిస్తున్నారు.
2024`25 ఆర్థిక సంవత్సరం ముగింపులో ఉన్నందున ఇంటిపన్ను చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. తక్షణమే కట్టకపోతే మంచినీరు, డ్రైనేజీ కనెక్షన్‌లు తొలగిస్తామని బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే తొలగించారు. ఆర్థిక సంవత్సరం ముగియకుండానే పెనాలిటీతో వసూలు చేయడం సమంజం కాదు. కావున 24% పెనాల్టీలు రద్దు చేసి మే నెలాఖరు వరకు పెనాల్టీ లేకుండా పన్నులు ప్రజలు చెల్లించే అవకాశం కల్పించాలని అందుకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.
ప్రజలు భారాలు మోసే స్థితిలో లేరని మీరు పలుసార్లు ప్రకటించారు. అదనపు భారాలు వేయబోమని మాట ఇచ్చారు. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు భారంగా మారిన సదరు సవరణ చట్టం 44/2020 జి.వో.నెం.198ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. ఏప్రిల్‌ నుండి 15% ఆస్తిపన్ను పెంపుదల లేకుండా తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు ఇవ్వడంతోపాటుగా, సదరు సవరణ చట్టం 44/2020ని రద్దు చేస్తూ ఆర్డినెన్సు జారీ చేయవలసిందిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org