
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 20 మార్చి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: శ్రీకాకుళం జిల్లాలో ఆశావర్కర్, అంగన్‌వాడీ వర్కరు, హెల్పరు పోస్టులను రూ. 2 లక్షల చొప్పున వేలం వేసి, డబ్బు చెల్లించలేదని, కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..
అయ్యా!
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం బోరుభద్ర పిహెచ్‌సి, గెద్దలపాడు గ్రామంలో ఆశావర్కర్ నుత్తు చంద్రమ్మ 2014 నుండి విధులు నిర్వహిస్తున్నది. ఆశావర్కర్‌కు వస్తున్న 10వేలు ఆదాయంపైనే తన కుటుంబం బ్రతుకుతున్నది. ఇప్పటివరకు గ్రామ ప్రజలు, పిహెచ్‌సి అధికారుల నుండి చంద్రమ్మపై ఎలాంటి ఫిర్యాధులు లేవు.
ఆశావర్కర్‌గా పని చేయాలంటే 2లక్షల రూపాయాలు వేలంపాటలో పాడి గ్రామ పెద్దలకు చెల్లించాలని గత ఎనిమిది నెలలుగా చంద్రమ్మను వేధిస్తున్నారు. గత ఆగష్టు నెలలో ఈ సమస్య మొదలయింది. నాడు ఎపి ఆశావర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది.
ఆశావర్కర్‌గా పనిచేయాలంటే గ్రామపెద్దలు ఆశా పోస్టుకి వేలం వేసిన 2లక్షలు చెల్లించాలని, లేనిపక్షంలో రాజీనామా చేయాలని చంద్రమ్మపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. మానసిక ఒత్తిడికి గురవుతూనే పనిచేస్తూ ఉన్నది.
ది.17.03.2025 నుండి విధులకు హాజరు కావద్దని గ్రామపెద్దలు దండోరా వేయించారు. గ్రామంలో ఎవరు ఎటువంటి సహాయం అందించకూడదని, ఆశా ఇచ్చిన మందులు కూడా తీసుకోకూడదు అని చెప్పి తెలియజేస్తూ విధులు నిర్వహించకుండా చంద్రమ్మని అడ్డుకోవడమే కాకుండా, కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గ్రామ ప్రజలను భయపెడుతున్నారు.
అలాగే ఇదే గ్రామంలో గత 10 సం॥ల నుండి అంగన్‌వాడీ సెంటర్‌లో ఎన్ హరిదేవి (వర్కరు), ఎం.గారమ్మ (హెల్పర్) పని చేస్తున్నారు. రూ.2 లక్షలకు వేలం పాడాము విధుల నుండి మానుకోవాలని వీరిని కూడా విధులకు హాజరుకానివ్వకుండా గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారు. అంగన్‌వాడీ సెంటర్‌కు తాళాలు వేసారు. పిల్లల్ని కూడా పంపించడం లేదు.
ఈ అనాగరికమైన, చట్టవిరుద్ధమైన గ్రామ పెత్తందార్ల చర్యలను తమరు వెంటనే జోక్యం చేసుకుని నిలుపుదల చేయించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆశావర్కర్ గ్రామంలో విధులు నిర్వహించడానికి, అంగన్‌వాడీ సెంటర్ తెరిపించి అంగన్‌వాడీ వర్కరు, హెల్పరు గ్రామంలో విధులు నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, వేలంపాట వేసి డబ్బు చెల్లించాలని వేధించిన వారిపై, గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చంద్రమ్మ, ఎన్.హరిదేవి, ఎం.గారమ్మ కుటుంబాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి