(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 19 మార్చి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిలిపివేయడానికి మీ జోక్యాన్ని కోరుతూ...
అయ్యా!
విశాఖ స్టీలు ప్లాంటు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. గత ఎన్నికల్లో కూడా ఈ సమస్య ప్రధానాంశంగా ముందుకు వచ్చింది. మీరు అధికారం చేపట్టాక కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చర్యలు, విశాఖ స్టీలు యాజమాన్య వైఖరి స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నాయి. ప్రకటించిన ప్యాకేజీ దాన్ని నిలబెట్టే లక్ష్యాన్ని సాధించలేదు. అందుకు కేంద్ర ప్రభుత్వ తాజా వైఖరి నిదర్శనం. కేంద్ర ఆర్ధిక శాఖ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ రాసిన ఉత్తరంలో (19.03.2025 ఆంధ్రజ్యోతి) ప్రైవేటీకరణపై గతంలో సిసిఈఎ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని తెలియజేయడం రాష్ట్ర ప్రజల్ని హాతాశుల్ని చేసింది. కార్మికులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. దీనికి తోడు స్టీలు యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించే ప్రక్రియ ఆరంభించింది. ఈ రెండు అంశాలు స్టీలు ఫ్మాక్టరీని కాపాడేందుకు మీరిచ్చిన హామీలకు భిన్నమైనవి. కావున మీరు తక్షణం జోక్యం చేసుకుని కార్మికుల తొలగింపును, ప్రైవేటీకరణయత్నాలను ఆపాలని కోరుచున్నాను.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను భారీగా తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే 644 కార్మికులను తొలగించింది. మరో 5,600 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రాధాన్యతలతో నిమిత్తం లేకుండా ప్రతి కాంట్రాక్టరూ తమ వద్ద పనిచేస్తున్న కార్మికులలో 30 శాతం కార్మికులను తగ్గించి వేయాలని ఆదేశాలు ఇచ్చింది. వీరిలో నిర్వాసితులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. రీజినల్ లేబరు కమిషన్ వద్ద చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రెండు ప్రధాన అంశాల ఆధారంగా మీరు తక్షణం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉందని భావిస్తున్నాం.
తమరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కాపాడతామని హామీ ఇచ్చారు. నేడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంలో వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఆర్భాటంగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏ రకంగానూ ప్లాంట్ పరిరక్షణకు సహకరించదు. సరికదా, దీనిని అన్ని రకాలుగానూ బలహీన పరిచే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. కార్మికులను తగ్గించి, ప్రైవేటీకరణ చేయాలనే దేశవ్యాపిత పాలసీకి అనుగుణంగానే నేటి కార్మికుల తొలగింపు నిర్ణయం. ఇప్పటికే సుమారు 1200 మంది పర్మినెంటు కార్మికులకు, అధికారులకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. సరైన నిర్వహణ లేక నేడు ప్లాంటులోని అనేక విభాగాలలో మిషన్లు తుప్పు పడుతున్నాయి. ఇవన్నీ ప్లాంటును బలహీనపరచడానికే సహకరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కార్మికుల సంఖ్య క్రమేణా తగ్గించి వేసి, ప్లాంటును అమ్మేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కార్మికుల తొలగింపును ఆపేందుకు మీరు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
రెండో అంశం: మీ ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. లక్షమందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి కల్పించే, రాష్ట్రంలోనే అతి పెద్ద భారీ పరిశ్రమ అయిన ఈ స్టీల్ ప్లాంటులో కార్మికులను తొలగించడం రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడదు. ఉపాధి కల్పన తగ్గిపోతుంది. ఇన్ని వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి, ఆ కుటుంబాలు రోడ్డున పడడం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలగజేస్తుంది.
కాంట్రాక్టు కార్మికుల తొలగింపును అడ్డుకుంటున్నారనే కారణంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనరుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో యాజమాన్యం షో కాజ్ నోటీసు కూడా ఇచ్చింది. యాజమాన్యం యొక్క అసలు ఉద్దేశం దీన్ని బట్టే అర్ధమవుతుంది.
అందువల్ల తమరు తక్షణం జోక్యం చేసుకుని, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తద్వారా ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన మీ హామీకి కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి