తాడి గ్రామ ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇళ్లు, భూములకు పరిహారం, మేజర్లకు ప్యాకేజీ చెల్లించి, సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 18 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం: అనకాపల్లి జిల్లా, పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీ(జెఎన్‌పిసి) పరిశ్రమలకు  అనుకొని వున్న కాలుష్య బాధిత తాడి గ్రామ ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇళ్లు, భూములకు పరిహారం, మేజర్లకు ప్యాకేజీ చెల్లించి,  సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని కోరుతూ...

అయ్యా!

2006లో 2,400 ఎకరాల విస్తీర్ణంలోని జెఎన్‌పిసి  ఏర్పాటుచేశారు.  ప్రస్తుతం 90 ఔషధ పరిశ్రమలున్నాయి.  డెవలపరైన ర్యాంకీ పర్యావరణ ప్రమాణాలు పాటించకపోవడం, గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించిన స్థలం కూడా విక్రయించడం, వ్యర్ధాలు శుద్ధి చేయకుండా విడిచిపెట్టడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. వాయు కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రమైన చర్మవ్యాధి, శ్వాసకోశ, గుండెజబ్బులు, కీళ్ల నొప్పులు, కిడ్నీ, గర్భస్రావ, నిద్రలేమి సమస్యలతో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు బాధపడుతున్నారు. వారి బాధలు వర్ణనాతీతం. ప్రతి ఇంటికీ, వ్యక్తికీ ఒక దీన గాధ ఉంది. మానవత్వంతో ఆలోచించి పరిష్కరించాల్సిన సమస్య ఇది.

మా పార్టీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మేము ఈ నెల 11న తాడి గ్రామం వెళ్లినప్పుడు  ప్రతి ఇంట్లో వివిధ అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించాను. తీవ్రమైన ఈ సమస్యకు  తాడి గ్రామ తరలింపే శాశ్వత పరిష్కారమని ప్రభుత్వాలు గుర్తించాయి. తరలిస్తామని తాడి ప్రజలకు హామీ ఇస్తూ వచ్చాయి. ఇప్పటికీ నాలుగు ప్రభుత్వాలు మారాయి. 18 సంవత్సరాలు గడిచాయి. పరిశ్రమలో భూములు కోల్పోయి, కాలుష్యంతో ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తాడిగ్రామాన్ని మాత్రం తరలించలేదు. పరిశ్రమల్లో ఉపాధి కల్పించలేదు. ఎన్‌జిటి జోక్యం చేసుకుంటే గానీ తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఈ నీరు కూడా సురక్షితంగా లేదు. భూములు త్యాగం చేసిన రైతులకు ఫార్మా కంపెనీల్లో స్థానికులకు ఉపాధి కల్పించడంలేదు. ఇటు ఉపాధి లేక మంచి నీరు, గాలి పీల్చుకొని జీవించేందుకు కూడా అవకాశం లేకుండా వుంది. 

ఔషధ కంపెనీలకు తాడికి మధ్య చిన్నపాటి రోడ్డు మాత్రమే వుంది. దీంతో వాయు కాలుష్య వాసన  భరించలేక సాయంత్రం నుంచి తెల్లవారే వరకు తలుపులు వేసుకొని బయటకు రాలేక ఇళ్లలో వుంటున్నారు. సమీప పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ పిల్లలు, వృద్ధులతో ఇళ్లు వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో బయటకు పరుగులు పెడుతున్నారు.  బిందెలు, డబ్బాల్లో నిల్వ చేసుకున్న నీరు 24 గంటలు గడిచేసరికి నల్లటిపొర పైన ఏర్పడుతోంది. ఇంతటి కాలుష్య సమస్యతో బాధపడుతున్న తాడి, చినతాడి, బిసికాలనీ గ్రామాల ప్రజలను తరలించే బాధ్యతను ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలి.

ఎన్నికల ముందు 2019 ఫిబ్రవరి 6న మీ ప్రభుత్వం తాడి, చినతాడి, బిసికాలనీ ప్రజలను పెదముషిడివాడ తరలింపునకు రూ.57.63 కోట్లు విడుదల చేస్తూ జిఓ 29 జారీ చేసిందికాని నిధులు విడుదల చేయలేదు. పది రోజుల్లో  తాడి గ్రామం తరలింపునకు అవసరమైన  రూ.56 కోట్లు ఇస్తామని 2022 ఏప్రిల్‌ 28న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారుగానీ తరలింపు చర్యలు చేపట్టలేదు.

మేజర్లను గుర్తించేందుకు 2017లో చేసిన సర్వేకు కాలపరిమితి అయిపోయినందున తాజాగా సర్వే నిర్వహించి మేజర్లను గుర్తించి ప్యాకేజీ చెల్లించాలి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇళ్లు, భూములకు  పరిహారం చెల్లించాలి. సురక్షిత ప్రాంతంలో మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చి, పునరావావసం కల్పించి తాడి ప్రజలను తరలించాలి. ప్రజలంతా పూర్తిగా వ్యాధులబారినపడక ముందే, ప్రాణ నష్టం జరగకముందే తాడి, చినతాడి, బిసికాలనీ ప్రజలను తరలించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  

  గత పెందుర్తి ఎమ్మెల్యే ప్రస్తుతం వి.మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తిగారు దేవుడు మీద ప్రమాణం చేసి తాడి గ్రామాన్ని తరలిస్తానని వాగ్ధానం చేశారు. సమస్య పరిష్కారం చేయకపోవడంతో 2024 ఎన్నికల్లో తాడి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించడం వల్ల ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, అనకాపల్లి ఎంపి సిఎం రమేష్‌ తాడి గ్రామస్తులను ఒప్పించి ఎన్నికల అయిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని వాగ్ధానం చేశారు. నేటికీ ఆ వాగ్ధానం చేసిన ఎమ్మెల్యే, ఎంపి కనీసం తాడి గ్రామాన్ని సందర్శించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. తాడి గ్రామాన్ని మరియు ఎస్‌ఇజెడ్‌, ఫార్మా కంపెనీల  నిర్వాసిత గ్రామాల్లో తమరు పర్యటన చేసి వారికి మనోధైర్యం కల్పించాలని వారి సమస్యను చట్ట ప్రకారం పరిష్కరించాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి