విద్యుత్‌ ట్రూ డౌన్‌పై మభ్యపరిచే ప్రచారం ఆపి, పెంచిన విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 మార్చి, 2025.

 

విద్యుత్‌ ట్రూ డౌన్‌పై మభ్యపరిచే ప్రచారం ఆపి,

పెంచిన విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి

- సిపిఐ(యం) డిమాండ్‌

విద్యుత్‌ భారాలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. ఏపీ ట్రాన్స్‌కో 2014-19 సంవత్సరాలకు సంబంధించి 1050 కోట్ల రూపాయల పైగా ఆదాయ, వ్యయాల్లో మిగులు వచ్చిందని, ఆ మేరకు ట్రూ డౌన్‌ ద్వారా వినియోగదారులకు చార్జీలు తగ్గించబోతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలో విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకపొగా 15,485 కోట్ల రూపాయలు అదనం గా సర్దుబాటు చార్జీల భారాన్ని ప్రజలపై వేసి బలవంతంగా వసూలు చేస్తున్నది. ఇది కాకుండా ప్రతినెల యూనిట్‌కు అదనంగా 40 పైసలు చొప్పున సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ వాస్తవాలను మభ్యపరిచి చార్జీలు తగ్గించడానికి చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రజలను మభ్యపరిచే రీతిలో ప్రచారానికి పూనుకోవటం తగదు. ఏపీ ట్రాన్స్‌కో కోవిడ్‌ సమయంలో నూతన విద్యుత్‌ లైన్ల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేసింది. కొత్త ప్రాజెక్టులను చేపట్టలేదు. దీనివలన అంచనాల్లో చూపిన అభివృద్ధి వ్యయం చేయలేదు. దీనితో మిగులు ఏర్పడిరది. ఈ వాస్తవాలను మరుగుపరిచి  కూటమి ప్రభుత్వం భారాల తగ్గింపు గురించి ఆలోచిస్తున్నట్లు, ఇప్పుడు అందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారానికి పూనుకోవటం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వానికి విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ పట్ల చిత్తశుద్ధి ఉన్న ఎడల తక్షణమే పెంచిన సర్దుబాటు చార్జీలను పూర్తిగా రద్దు చేయాలి. ట్రాన్స్‌కో ద్వారా  వచ్చిన మిగులు ద్వారా 1000 కోట్ల రూపాయల ట్రూ డౌన్‌ చేసి విద్యుత్‌ టారిఫ్‌ను కూడా తగ్గించాలి. వినియోగదారులు వాస్తవాలను గమనించి విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు భారాలపై ఆందోళనకు సిద్ధం కావాలి. ఈనెల 28న జరగనున్న ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఐ(యం) ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి