
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 మార్చి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : బాబు జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్ట్ కాలువ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగు, త్రాగు నీరు ఇచ్చేందుకు, ఇప్పుడున్న ఆయకట్టు పరిస్థితికి అనుగుణంగా మార్పుచేసి ప్రాజెక్టు వ్యయం, రైతుల భూనష్టం తగ్గించేలా చూడాలని కోరుతూ...
అయ్యా!
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా విజయనగరం జిల్లాలో 3లక్షల 94వేల ఎకరాలు , శ్రీకాకుళంలో 84 వేల ఎకరాలు సాగునీటి లక్ష్యంతో ఉన్నది. ఇప్పటికే ప్రతిపాదిత ఆయకట్టు సుమారు 45 వేల ఎకరాలు తోటపల్లి ప్రాజెక్టు కుడికాలువలోను, తోటపల్లి గజపతినగరం బ్రాంచి కాలువలో 15 వేల ఎకరాలును, తారకరామ ప్రాజెక్టు 22 వేల ఎకరాలు, తాటిపూడి ప్రాజెక్టు కింద 15వేల ఎకరాలు, ఆండ్రప్రాజెక్టు కింద 9500 ఎకరాలు స్థీరీకరణ చేసి ఉన్నది. సుజల స్రవంతి కాలువలో కలిపి ద్వంద ఆయకట్టుగా, అలాగే సుమారు 20వేల ఎకరాలు రియల్‌ఎస్టేటుగా మారడం వలన ఇప్పుడు అవసరమైన ఆయకట్టుకు అనుగుణంగా ప్రధాన కాలువ డిజైన్ మార్చుకొని రెండు జిల్లాల ఆయకట్టుకు త్రాగు, సాగు నీరు, పరిశ్రమలు, ఇతర అవసరాలకు అందించవచ్చును.
ఇప్పుడున్న ప్రధాన కాలువను 1,01,575 మీటర్ల దూరంను తగ్గించుకొని 47,000 మీటర్లు నుండి ఎస్.కోట మండలం కొత్తూరు వద్ద నుండి రేగ పుణ్ణిగిరి ద్వారా బొడ్డవర వద్ద గల చిలకలగెడ్డలోకి సుమారు 7 కిలోమీటర్లు ప్రధాన కాలువ గ్రావిటీ ద్వారా మళ్లించి, తాటిపూడి రిజర్వాయర్ ద్వారా తాటిపూడి ఎక్స్‌టెన్షన్ బాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి గ్రావిటీ ద్వారా ప్రతిపాదిత కాలువను బొండపల్లి మండలం గుమడం వద్ద నుండి తీసుకుపోయి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతిపాదిత ఆయకట్టుకు నీరు అందించవచ్చు. ప్రతిపాదిత ప్రధాన కాలువ 40 కి.మీ. తగ్గి సుమారు 2000 ఎకరాలు భూసేకరణ తగ్గి, ప్రాజెక్టు ఖర్చు, రైతుల నుండి రెండు, మూడు పంటలు పండే భూనష్టం తగ్గించవచ్చు. మార్పు చేసిన డిజైన్ వలన లిఫ్ట్‌లు తగ్గి గ్రావిటీ మీద నీటి సరఫరా చేయవచ్చు.
ఎన్నికల ముందు మీరు బొండపల్లి బహిరంగ సభలోనూ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గంట్యాడ బహిరంగ సభలో రైతులకు డిజైన్ మార్పులకు అవకాశాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇరిగేషన్ అధికారులు డిజైన్‌మార్పులు పరిశీలించకుండా యధావిధిగా భూసేకరణకు పూనుకుంటున్నారు.
కావున నిపుణులతో పరిశీలింపచేసి ప్రభుత్వానికి ప్రాజెక్టు భారాన్ని తగ్గించి, ప్రతిపాదిత ఆయకట్టుదారులకు నీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు భూనష్టాన్ని తగ్గించే విధంగా రైతు, రైతు సంఘాలతో చర్చించి సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రత్యామ్నాయం పరిశీలించవలసిందిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి