ప్రజలపై భారాలు వేసే ఒప్పందాలకు వ్యతిరేకంగా 28న విద్యుత్‌ కార్యాలయాల ముందు ధర్నా

(ఈరోజు (15 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

ప్రజలపై భారాలు వేసే ఒప్పందాలకు వ్యతిరేకంగా 
28న విద్యుత్‌ కార్యాలయాల ముందు ధర్నా
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
‘విద్యుత్‌ షాకులు పుస్తకావిష్కరణ’
జగన్‌ అవినీతికి చంద్రబాబు వత్తాసు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాలు, ప్రజావ్యతిరేకమైన ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న విద్యుత్‌ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయవాడలోని ఎంబివికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాంతో కలిసి ‘జగన్‌ సర్కారు పోయి బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్‌ షాకులు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒకవైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చెబుతూనే 2025 జనవరిలో యూనిట్‌పై రూ.0.40పైసలు భారం వేశారని అన్నారు. దళితులకూ వేలల్లో విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని, 63 యూనిట్ల విద్యుత్‌ వాడితే రూ.548, 67 యూనిట్ల విద్యుత్‌ వాడితే రూ.867, 120 యూనిట్లు వాడితే రూ.3672 బిల్లులు వేశారని పేర్కొన్నారు. ఇవన్నీ ఉచిత విద్యుత్‌ అమలు చేయాల్సిన దళితుల ఇళ్లకు వచ్చిన బిల్లులేనని తెలిపారు. ఎన్నికల ముందు విద్యుత్‌ భారాలు పెంచబోమని, ఒప్పందాలపై విచారణ చేస్తామని చెప్పారని, ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సెకీ ఒప్పందంపైనా, టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్మార్ట్‌మీటర్లపై హైకోర్టులో కేసు వేశారని తెలిపారు. సెకీ ఒప్పందం ద్వారా రూ.3750 కోట్లకుపైగా భారం పడుతుందనీ, అసలు సెకీ ఒప్పందమే తప్పుడుదని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు చెప్పారన్నారు. వాస్తవంగా సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థని, ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి ఎందుకు ఈ తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. గుజరాత్‌ ప్రభుత్వానికి అదానీ కంపెనీ రూ.1.99 పైసలకు సరఫరా చేస్తూ, మనకు మాత్రం రూ.2.49 పైసలకు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం భారాలు వేయబోమంటుంటే మరోవైపు భారీ ఎత్తున బిల్లులు వస్తున్నాయని, వీటి లాజిక్‌ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం అదానీ కోసమే విద్యుత్‌ ఛార్జీల పెంపును సమర్థించుకుంటున్నారని, ఇక్కడ పరస్పరం విమర్శించుకుంటున్న జగన్‌, చంద్రబాబు కేంద్రంలో మోడీకి కుడి, ఎడమలుగా ఉన్నారని అన్నారు. సెకీతో ఒప్పందం సమయంలో జగన్‌ రూ.1750 కోట్ల ముడుపులు అందాయని అమెరికాలో నమోదైన కేసుపై లోకేష్‌ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అదానీతో చేసుకున్న ఒప్పందం తాలూకూ వివరాలు బయటపెట్టడం లేదని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం అదానీ కంపెనీ 7000 యూనిట్లు సరఫరా చేయాల్సి ఉన్నా 2024 సెప్టెంబర్‌ నాటికి మూడువేల యూనిట్లు మాత్రమే సరఫరా చేశారని పేర్కొన్నారు. అయినా ఒప్పందాన్ని కొనసాగించడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై వేస్తున్న భారాలు, అక్రమ ఒప్పందాలు, అన్యాయపు వసూళ్లకు వ్యతిరేకంగా ఈనెల 28న అన్ని విద్యుత్‌ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని, భారాలపై వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే మా ఇంటికి స్మార్ట్‌మీటర్లు వద్దు, ట్రూఅప్‌ భారాలు వద్దని క్యాంపెయిన్‌ నిర్వహిస్తామని వివరించారు.
ప్రతి గ్రామంలోనూ సమస్యలు
ఈనెల 8వ తేదీ నుండి ప్రజాచైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామని, వీటిల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యలు పెద్దఎత్తున వివరిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగేందుకు మంచినీరు లేదని, జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద పైపులైన్లు వేసినా నీళ్లు రావడం లేదని తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పలు గ్రామాల్లో నీరు తాగలేని పరిస్థితి ఉందని అన్నారు. ప్రజలు అత్యంత దయనీయస్థితిలో వాటిని తాగుతున్నారని తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకోవాలని, వారు తాగుతున్న నీరు తాగి చూడాలని తెలిపారు. ఎక్కువ గ్రామాల్లో మురుగునీరు పోయే పరిస్థితి లేదని అన్నారు. రిలయన్స్‌ కంపెనీ పొలాలు, చెరువులకు వెళ్లే నీటిని కూడా తోడేస్తోందని, స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. వేట నిషేధ కాలంలో మత్య్సకారులు ప్రభుత్వం ఇవ్వాల్సిన భృతి ఇవ్వలేదని, లాయర్లు, మహిళలు, విద్యార్థులు, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి  ఐదు రకాల సంక్షేమ పథకాల అమలు లేదని తెలిపారు. ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన అంశాలపై సచివాలయాలు, మండల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
దిక్కున్నచోట చెప్పుకోండని హోంమంత్రి అనడం సమంజసమా
తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు హోమ్‌శాఖ మంత్రికి చెబితే లాక్కుంటాం దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరించారని తెలిపారు. అలాగే నక్కపల్లి, పరవాడ పారిశ్రామిక ప్రాంతం మధ్యలో ఉన్న దాడి గ్రామంలో అక్కడి ఎమ్మెల్యే తాను ఎన్నికైన 15 రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారని, దేవుడిపై ప్రమాణం చేశాడని తొమ్మిది నెలలు గడిచినా ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ గ్రామం పారిశ్రామిక ప్రాంతం మధ్యలో ఉందని అయినా అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారని, అవి వచ్చి ఎవరిని ఉద్దరిస్తాయో చెప్పాలని డిమాండు చేశారు.
పోలవరం పరిహారం తేల్చాలి
పోలవరంలో నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంలో పెంపుదల లేకపోగా లబ్దిదారుల సంఖ్యలో కోత పెడుతున్నారని, ఇప్పటికి మూడువేలమందిని తగ్గించారని అన్నారు. 2016లో నిర్ణయించిన పరిహారాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచడం లేదని, ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రెండుసార్లు పెంచారని పేర్కొన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ అదనపు కుటుంబాలను చేర్చాల్సింది పోయి తగ్గిస్తున్నారని, ముంపు గ్రామంలో రోడ్డుకు ఒకవైపున ముంపుగా గుర్తించి రెండోవైపున గుర్తించలేదని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆయా గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిశీలించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో పునరావాసం తరువాతే పోలవరం అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనేతరులను రెచ్చగొడుతోందని తెలిపారు. ఇప్పటికీ ట్రైబల్‌ ఎడ్వయిజరీ కమిటీ సమావేశం జరగలేదని తెలిపారు. నిర్వాసితులను మోసంచేసే వైఖరి మానుకుని, ఏప్రిల్‌, మే నెలల్లో పునరావాస సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు వారసులు కమ్యూనిస్టులే
హిందీ భాషను బలవంతంగా రుద్దుతామన్న పవన్‌ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రిగానీ, లోకేష్‌గానీ ఇంతవరకు స్పందించలేదని శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్‌టిఆర్‌ ఆశయాలకు విరుద్ధమైన ఈ ప్రకనటపై ఇప్పటి వరకూ నోరెత్తకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 2019లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలు, ఇప్పటి మాటలు ఒకసారి వింటే పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. అప్పుడు బిజెపి మోసం చేస్తుందన్న పవన్‌ ఇప్పుడు అదే బిజెపి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. భారతీయ భాషలను నాశనం చేసి హిందీ అమలుకు కేంద్రంలో బిజెపి ప్రయత్నిస్తోందని, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా హిందీని అమలు చేస్తామనే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు. టిడిపి గనుక పవన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తే ఎన్‌టిఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేది కమ్యూనిస్టులేనని, పదేపదే సనాతన ధర్మం గురించి చెప్పే పవన్‌కల్యాణ్‌ చరిత్రలో రామానుజాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మం, వేమన, కబీర్‌ వంటి వారు చెప్పిన వాటినికూడా అమలు చేయాలని కేవలం మనుధర్మాన్ని అమలు చేస్తే దేశానికి హానికరమని అన్నారు. బలవంతంగా హిందీని రుద్దుతామనే చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
= = = =