
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 14 మార్చి, 2025.
అదానీ - సెకీ ఒప్పందం కొనసాగింపు పై
ముఖ్యమంత్రి ప్రకటన గర్హనీయం
లక్షా పదివేల కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపే అవినీతికర సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ మరోసారి డిమాండ్ చేస్తున్నది. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో దాన్ని రద్దు చేయబోమని, కొనసాగిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు గతంలో వైసిపి ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా అదానీ సంస్థల నుండి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నది. ఆనాటి ప్రభుత్వ పెద్దలకు 1750 కోట్ల రూపాయల ముడుపులిచ్చి ఈ ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా కోర్టులలో సాక్షాధారాలతో విచారణ జరుగుతున్నది. అనేక ఆధారాలు బట్టబయలు అయ్యాయి. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి కేంద్రం అండతో రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం చేసే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోగా కొనసాగించడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆమోదించడమే అవుతుంది. గత కొద్ది నెలలుగా ఆలోచిస్తున్నామని, న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామని సన్నాయి నొక్కులు నొక్కిన ముఖ్యమంత్రి నేడు బహిరంగంగా ఒప్పందం కొనసాగిస్తామని ప్రకటించడం శోచనీయం. ఒప్పందం రద్దు చేస్తే పెనాల్టీలు కట్టవలసి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పటం వాస్తవ విరుద్ధం. ప్రపంచంలో శ్రీలంక, బంగ్లాదేశ్ తో సహా అనేక దేశాలు అదానీ సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా అనేక కాంట్రాక్టులను తిరగ దోడిరది. కానీ కేంద్రానికి, అదానీకి లొంగిపోయి ఈ ఒప్పందాన్ని కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ రంగానికి తీరని హాని కలిగిస్తుంది. ఒప్పందాన్ని రద్దుచేసి ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సింది పోయి కార్పొరేట్లకు విశ్వాసం కల్పించే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం సిగ్గుచేటు.
అదానీ ఒప్పందం విషయంలో కేంద్రం లోని బిజెపి గతంలో ప్రభుత్వం లో వున్న వైసిపి, నేడున్న టిడిపి, జనసేన కూటమి ఒకే దారిలో నడుస్తున్నాయి. అవినీతిని బయటికి తీస్తానన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ అవినీతిని కాపాడటానికి పూనుకోవటం వారి ద్వంద వైఖరికి నిదర్శనం. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని గతంలో ప్రతిపక్షంలో ఉండగా నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హైకోర్టులో పిల్ కూడా వేశారు. నేడు కూటమి ప్రభుత్వం మాట మార్చి ఆదానీ, జగన్మోహన్ రెడ్డి అవినీతిని కాపాడుతున్నది. మరోవైపు నిన్న శాసన సభలో లోకేష్ జగన్ అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలిస్తామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రానికి హానిచేసే అదానీ, సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అవినీతి ఒప్పందాలపై విచారణ చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి