కర్నూలు జిల్లా కేంద్రంలో ఏండ్లకేండ్లుగా ఇళ్ల స్థలాలు లేక ఎదురుచూస్తున్న పేదలు ఒక్కసారిగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 2000 మంది ఎర్రజెండాలు చేతపట్టి కల్లూరు అర్బన్ పరిధిలోని సర్వేనెంబర్ 70/2 బి లో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూమిలో జెండాలు పాతి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి నిర్మల, పి యస్ రాధాకృష్ణ, యం డి ఆనంద్ బాబు, టి రాముడు, నగర కార్యదర్శి యం రాజశేఖర్ నాయకత్వంలో పేదలు స్థానిక పెద్దపాడు దగ్గరలో ఉన్న తాజ్ ఫంక్షన్ హాల్ నుండి సర్వే నెంబర్ 70/2 బి లో ఉన్న ఏ డబ్ల్యూ ప్రభుత్వ భూమి దాకా వేలాది ప్రజలతో వెళ్లి అందులో ఉన్న కంప చెట్లు కొట్టి, చదును చేసి భూమిని స్వాదినం చేసుకున్నారు. అంతలోనే అక్రమంగా ఆ ప్రభుత్వభూమిలో లేఅవుట్లు వేసి అమ్ముకున్న వ్యక్తులు వచ్చి భూమి మాది అని నిలవరించే ప్రయత్నం చేశారు. ప్రజలు తిరగబడడంతో అక్రమంగా పోలీసులను దించారు. పోలీసులు వచ్చినా ససేమిరా అంటూ ప్రజలు అక్రమార్కులపై చర్యలు తీసుకోండి మా ఇళ్లస్థలాల కోసం వచ్చామంటూ నినదించారు. పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ద్రోనులతో ఫోటోలు తీసే తీయించే ప్రయత్నం చేశారు. బండ్లు బైకుల ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. దాంతో ఒక్కసారిగా ప్రజలంతా అక్రమ దారులకు మద్దతుగా వచ్చిన పోలీసుల విధానం నశించాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, రెండు సెట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. భూమిని అక్రమంగా పట్టా పట్టించుకున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం జిందాబాద్ అంటూ అక్కడే ఆందోళన చేయడంతో, తప్పని పరిస్థితుల్లో తహసిల్దారును రప్పించారు. తహసిల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ స్థలమే మీరు వచ్చిన వాళ్లంతా అర్హులు అయితే మీ ఆధార్ కార్డులతో పాటు అప్లికేషన్ ఇవ్వండి, మీరు అర్హులని తేలితే ఇక్కడే లేఅవుట్ వేసి రెండు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే అనేక దపాలు ఇళ్ల స్థలాలు ఇవ్వండి మహాప్రభో అంటూ మూకుమ్మడిగా, వ్యక్తిగతంగా అర్జీలు ఇచ్చామని, స్థలాలు మాత్రం ఇచ్చింది లేదన్నారు. అయినా సరే తహసిల్దార్ మాట మేరకు మరొకసారి మూడు రోజుల్లో ప్రతి స్థలం లేని పేదవారు అర్జీ ఇస్తారని, వెంటనే తేల్చి లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గురు శేఖర్, నగేష్, అలివేలమ్మ అరుణమ్మ నరసింహులు సాయిబాబా రామకృష్ణ అబ్దుల్ దేశాయ్ సుధాకరప్ప రంగప్ప శంకర్ సత్యం తో పాటు మరో రెండు వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.