అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం గురించి..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 11 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం గురించి...

అయ్యా!

చోడవరం సహకార చక్కెర కర్మాగారం క్రషింగ్‌ సీజన్లో తరచూ చెరుకు క్రషింగ్‌ ఆగిపోతుంది. ఈ సంవత్సరం (2024-25) కూడా ఆగిపోయింది. రోజులు తరబడి ఫ్యాక్టరీ నడవక ఫ్యాక్టరీకి వచ్చిన చెరుకు ఎండల్లో  చెరుకు ఎండిపోతూ రికవరీ, టన్నేజ్‌ రాక రైతులు నష్టపోతున్నారు. ఫ్యాక్టరీకి తెచ్చిన లారీలు, ట్రాక్టర్లు, ఎడ్లబళ్ళు వారం రోజులు వరకు అన్లోడ్‌ కాకపోవడం వలన వాహనాల అద్దెల భారం భరించలేక రోజుల తరబడి పశువులను ఫ్యాక్టరీ వద్ద ఉంచలేక రైతులు నలిగిపోతున్నారు. సీజన్‌ ప్రారంభం నుండి ఫ్యాక్టరీ సాంకేతిక లోపాలు, స్కిల్డ్‌ వర్కర్లు లేకపోవడం, కరెంటు అంతరాయాలు వంటి కారణాల వలన క్రషింగ్‌ సజావుగా జరగక చెరుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఫ్యాక్టరీ 1955వ సంవత్సరంలో రిజిస్టర్‌ అయి 1962వ సంవత్సరంలో 1,000 టన్నులు క్రషింగ్‌ సామర్ధ్యముతో ప్రారంభించబడిరది. 2003 నాటికి 4,000 టన్నులకు పెంచడం జరిగింది. ప్రస్తుతం 23,477 మంది షేర్‌ హోల్డర్స్‌, 14,500 మంది చెఱకు సప్లై చేయుచున్న రైతులు ఉన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన కర్మగారం యంత్రాలు పాతవై, పని చేయక మొరాయిస్తున్నాయి. మరోవైపున మెయింటినెన్స్‌ ఓవరాల్‌ పనుల్లో నాణ్యత లేమి కారణాల వలన ఫ్యాక్టరీ సరిగా నడవక తరచూ అంతరాయం ఏర్పడుతూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కావున ప్రభుత్వం ఫ్యాక్టరీ ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రంలో నడుస్తున్న ఈ ఒక్క చక్కెర ఫ్యాక్టరీనీ కాపాడాలనే రైతాంగం కోరికను నెరవేర్చాలని కోరుచున్నాము. 2025 జనవరి 20న సీజన్‌ ప్రారంభించిన నాటి నుండి ఇంతవరకు సప్లై చేసిన రైతులకు పేమెంట్లు ఇవ్వలేదు. షుగర్‌ కంట్రోల్‌ యాక్ట్‌ 1966 ప్రకారం చెరుకు సరఫరా చేసిన 15 రోజులకు రైతులకు డబ్బులు చెల్లించాలని చట్టం చెబుతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించలేదు. గత సంవత్సరం బకాయిలు, ఈ సంవత్సరం పేమెంట్స్‌ ఇంతవరకు చెల్లింపులు లేవు.  రైతులు అప్పులు చేసి మరీ ఫ్యాక్టరీకి చెరుకు సప్లై చేస్తున్నారు. కార్మికులకి బకాయిలు జీతాలు కూడా చెల్లించాలి. కావున ప్రభుత్వం జోక్యం చేసుకొని బకాయిల చెల్లింపు నిమిత్తం తక్షణం సహాయంగా 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాను.

కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై ‘రాష్ట్ర సలహాధర’ మన రాష్ట్రంలో అమలు కాలేదు. దాని వలన టన్ను చెరుకుకి రైతు రూ.500లు నష్టపోతున్నాడు. దేశంలో అన్ని రాష్ట్రాలు సలహాధర ఆయా రాష్ట్రాల్లో చెల్లిస్తున్నారు. కావున మన రాష్ట్రంలో రాష్ట్ర సలహాధరలను పునరుద్ధరించాలని కోరుచున్నాను.

రాష్ట్రంలో గతంలో పనిచేసిన 29 షుగర్‌ ఫ్యాక్టరీలకు 24 ఫ్యాక్టరీలు మూత పడినవి. ఈ సంవత్సరం కేవలం 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తున్నాయి. వీటికి సరిపడినంత చెఱకు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెరకు డిమాండ్‌ ఉన్నప్పటికీ ఫ్యాక్టరీలు మూతపడటం రాష్ట్రాభివృద్ధికి దోహదపడే చర్య కాదు. రైతులు చెఱకు పంట ధర గిట్టుబాటుకాక చెరుకు సాగు తగ్గించారు. కావున ప్రభుత్వం రాష్ట్రంలో చక్కెర పాలసీ రూపొందించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, పేమెంట్స్‌ ప్రతి 15 రోజులకు చెల్లించి, మంచి రికవరీ టన్నేజ్‌ వచ్చే చెరుకు వంగడాలను రైతుకు అందించాలని, రాష్ట్రంలో చెఱకు పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలని, తక్షణం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునికరించాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి