రాష్ట్రవ్యాపితంగా ఆందోళన చేస్తున్న వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 07 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : రాష్ట్రవ్యాపితంగా ఆందోళన చేస్తున్న వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...

అయ్యా!

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ (తిరుపతి) పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 4 జిల్లాల్లో వెటర్నరీ వైద్య విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్న్‌షిప్‌ కాల వ్యవధిలో ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు భోజనాలు మరియు వసతి నిమిత్తం 2017 సంవత్సరంలో ఇంటర్న్‌షిప్‌ స్టైఫండ్‌ రూ.7 వేలు నిర్ణయించారు. ఈకాలంలో ధరలు, చార్జీలు, వసతి అద్దె పెరిగాయి. అందుకు అనుగుణంగా స్టైఫండ్‌ పెంచలేదు. పెరిగిన ధరలు చార్జీలు, అద్దెలను బట్టి మెడికల్‌ విద్యార్థులకు సుమారు రూ.25 వేలు చెల్లించాలని మన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వెటర్నరీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి నేటి వరకు 33 రోజులు నుండి కళాశాల వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. మంత్రులకు ఎమ్మెల్యేలకు అనేకమార్లు విన్నవించారు. కానీ నేటికీ సమస్య పరిష్కరించలేదు. వారు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తిరుపతి యూనివర్సిటీలో హాస్టల్స్‌ మూసివేసి బయటికి వెళ్లండని విద్యార్థులను పంపించివేయడం గర్హనీయం. 

కోర్స్‌ ఆరు సంవత్సరాలు ఉంటుంది. చివరి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్‌  ఉంటుంది. ఈ కాల వ్యవధిలో ఏదైనా రెండు జిల్లాలలో ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్స్‌, పశు సంరక్షణ కేంద్రాలకు వెళ్లి జంతు ప్రదర్శనశాలలో పనిచేయవలసి ఉంటుంది. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో వీరంతా సేవలు అందిస్తారు. నగరాల్లో, పట్టణాల్లో కాకుండా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించవలసిన పరిస్థితి ఉంటుంది. ఒరిస్సా రాష్ట్రంలో ప్రస్తుతం రూ.14 వేలు చెల్లిస్తున్నారు. కేరళలో రూ.17 వేలు, తమిళనాడులో రూ.18 వేలు రాజస్థాన్‌ రూ.23 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఇచ్చే స్టైఫండ్‌ కనీస ఖర్చులకు కూడా సరిపోవడం లేదు.

మీరు స్వయంగా జోక్యం చేసుకొని వారి సమస్యలను పరిష్కారం చేయాలని, విద్యార్థులు కోరుతున్నట్లు స్టైఫండ్‌ నెలకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి