(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 06 మార్చి, 2025.
శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్ గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : సూపర్ సిక్స్ వాగ్దానాల అమలు, 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు, మహిళల అదృశ్యంపై విచారణ తదితర అంశాలపై 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సెషన్ జరపాలని కోరుతూ...
అయ్యా!
అసెంబ్లీ ఎన్నికలలో కూటమి నాయకత్వం చేసిన వాగ్దానాలను విశ్వసించి ఓటేసి మీకు గొప్ప విజయాన్ని చేకూర్చడంలో మహిళలు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ.1500లు ఇస్తామని, ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని, రూ.10 లక్షలు రుణం తీసుకున్న పొదుపు మహిళలకు జీరో వడ్డీ ఇస్తామని, తల్లికి వందనం, మూడు ఉచిత సిలిండర్లు, తదితర పథకాలను అమలు చేస్తామని ఆనాడు బలమైన హామీనిచ్చి ఇంటింటికీ ప్రచారం చేశారు. మూడు ఉచిత సిలిండర్లు పథకాన్ని పాక్షికంగా అమలుజేశారు. మహిళలు డబ్బు చెల్లించకుండా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని, ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మిగిలిన వాగ్దానాలు ఇంత వరకు అమలు చేయలేదు. మహిళలు వాటి అమలుకోసం ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీటిని అమలు చేస్తూ ప్రకటన చేయాలని కోరుతున్నాను.
చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. కాని దాని అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 2029 ఎన్నికల నుండే దాన్ని అమలు చేయాలని ఎన్‌డిఏ కూటమిలో ముఖ్య భాగస్వాములుగా ఉన్న మీరు పలుకుబడిని ఉపయోగించాలని కోరుతున్నాను.
2023 జూలైలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న సంచలనమైన వార్తను మీరు బయటపెట్టారు. కేంద్ర హోంశాఖ నిఘా వర్గాల నుండి విశ్వసనీయమైన సమాచారం మీకు అందినట్లుగా కూడా చెప్పారు. ఆనాటి ప్రభుత్వం దీనిపై విచారణ జరపడానికి తిరస్కరించింది. ఎన్నికలకు ముందు పదే పదే దీనిని ఒక వివాదంగా మార్చిన మీరు ఎన్నికల అనంతరం మౌనం దాల్చడం దురదృష్టకరం. పార్లమెంటులో కేంద్ర హోంశాఖా మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు, పిల్లలు అదృశ్యమైనట్టు ప్రకటించారు. కనీసం విచారణ జరపలేదు. వాస్తవాలూ వెల్లడిరచలేదు. ఈ మధ్యకాలంలో పసిపిల్లలను అమ్మే ముఠా ఒకటి విజయవాడలో పట్టుబడిరది. ఇలాంటి ముఠాలకు కార్యస్థానంగా మన రాష్ట్రం మారడం ఆందోళనకరమైన విషయం. ఉపముఖ్యమంత్రిగా మీకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి మహిళల అదృశ్యంపై కమిటీ నియమించాలని, దానికి బాధ్యులైన ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
రాష్ట్రంలో మహిళల రక్షణకు సత్వర న్యాయం కల్పించడానికి సురక్ష పోలిస్ స్టేషన్‌లు, కొత్త యాప్‌లు తెచ్చినట్లు ప్రకటించారు. ఇవి గతంలో ఉన్న పేర్లు మార్పిడి తప్ప ఏ విధంగానూ మహిళలను ఉద్దరించగలిగేవి కాదు. రాష్ట్రంలో మాఫియా గ్యాంగ్‌లు, డ్రగ్గిస్టులు స్వేచ్ఛగా విహరిస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నది. మద్యం వాడకం విచ్చలవిడిగా పెరిగింది. తాగిన మైకంలో చిన్న పిల్లలు, వృద్దులు అన్న విచక్షణ కూడా కోల్పోయి అత్యాచారాలు చేస్తున్నారు. ఇళ్ళల్లో మహిళలను హింసించి వేధిస్తున్నారు. చిన్న పిల్లల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణమైన అత్యాచార వార్తలు వింటూ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డ్రగ్గు, లిక్కర్ మాఫియాలు అధికార పార్టీల అండదండలతోనే స్వైర విహారం చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో అనేకచోట్ల కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి.
కావున మహిళలను వేధిస్తున్న పై సమస్యలపై 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించి చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నాను. తద్వారా మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి