
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం.
- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 03 మార్చి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : పవర్‌ప్లాంట్‌ల కోసం భూములు ఇచ్చిన నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామ దళితులు, గిరిజనులు, మత్స్యకారులు, స్థానికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..
అయ్యా!
నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామ దళితులు, గిరిజనులు, మత్స్యకారులు, స్థానికులు ఎపిజెన్‌కో, గాయత్రి పవర్‌ప్లాంట్‌ల కోసం భూములు ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. ఆనాడు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రతీ ఇంటికీ ఉద్యోగం ఇస్తామని కంపెనీ యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు చెప్పారు. కానీ అది కేవలం 100కి 30 మందికి మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అరకొర ఉపాధి దక్కింది. మిగిలిన 70% మంది ప్రజానీకానికి ఉపాధిలేక, పంట పొలాలు లేక ఉపాధి కరువయ్యింది. అదేవిధంగా తరలింపు గ్రామం అనే పేరుతో ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల పాలౌతున్నారు. రోగాల భారిన పడిన వారికి వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇళ్లు శిధిలావస్థకు చేరాయి. అయినా గత్యంతరం లేక ఆ ఇళ్ళలోనే బ్రతుకు వెళ్లదీస్తున్నారు.
తరలింపులో భాగంగా నేలటూరు ప్రధాన గ్రామస్థులకు ఇళ్ళు కడుతున్నారు. నేలటూరు పాలెం వారికి ప్లాట్లు చూపించారు. కానీ దళిత, గిరిజనులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపలేదు. సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఫలితం లేదు. అలాగే నేలటూరు పాలెం వారికి ఒక్కొక్క ఇంటికి, ప్రతీ నెలా రూ.2500/`, 25 కేజీల బియ్యం, గత 6 సంవత్సరాలుగా అందిస్తున్నారు. కానీ అదే తరహాలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారికి కూడా అందించేందుకు చర్యలు చేపట్టాలి. గ్రామం నుండి తరలించే వరకూ దళితులు, గిరిజనలకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాను.
నేలటూరు గ్రామ దళిత, గిరిజనులకు ఉపాధి, వైద్యం, నివాసం తదితర సౌకర్యాలు కల్పించి, వారికి న్యాయం చేయాలని కోరుతున్నాను. నేలటూరు గ్రామస్తులకు 3సం॥ల క్రితం ఇళ్ళు నిర్మించినా ఇంతవరకూ స్వాధీనం చేయలేదు. వీటిని వెంటనే లబ్దిదారులకు స్వాధీనం చేయాలి. మిగిలిన వాళ్లకు స్థలాలు సేకరించినా గృహల నిర్మాణం, మౌళిక సదుపాయాలు కల్పించలేదు. మీరు విచారించి సత్వర చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి