స్థానిక సమస్యలపై మార్చి 8 నుండి ప్రజాచైతన్య యాత్రలు.... 22 నుండి మహాజర్లు, ధర్నాలు..

ఈరోజు (02 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

స్థానిక సమస్యలపై
మార్చి 8 నుండి ప్రజాచైతన్య యాత్రలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
22 నుండి మహాజర్లు, ధర్నాలు
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల కోసం ఈ యాత్రలు గళం విప్పుతాయి. రెండురోజులపాటు విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించి కార్యచరణ రూపొందించామని తెలిపారు. మార్చి 8 నుండి 17వ తేదీ వరకూ యాత్రలలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 22వ తేదీ నుండి 28వ తేదీ వరకూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహాజర్లు, ధర్నాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఏప్రిల్‌, మే నెలల్లో పోరాట రూపకల్పన చేస్తామని అన్నారు. ఆదివారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, కె.ప్రభాకరరెడ్డితో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు.
ప్రజా సమస్యల అధ్యయనం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు. అలాగే పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు చేస్తారని, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్‌ 6 వాగ్దానాల్లో ముఖ్యమైన ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని, ఉగాది నాటికి యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1,500 అమలును ప్రకటించాలని కోరుతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో అయినా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, బడ్జెట్లో రాయితీలు ఏమైనా ఇస్తారోమోనని తొమ్మిది నెలలపాటు ప్రజలు ఎదురు చూశారని వారి ఆశలు అడియాశలు అయ్యాయని పేర్కొన్నారు. మాటలకు చేతలకు పొంతన లేదని తెలిపారు. సూపర్‌సిక్స్‌ పథకాలకు నిధులు తగ్గింపు ద్వారా వాటిని కుదించే ప్రయత్నం చేశారని విమర్శించారు. పి4 పేరుతో 20 శాతం మంది లబ్దిదారులను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని, వృద్ధుల నెత్తిన శఠగోపం పెట్టారని పేర్కొన్నారు. పి4 పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తీసుకువస్తే పెట్టుబడిదారులు పరిగెత్తుకుంటూ వచ్చేవారని, పదిసార్లు కేంద్రం చుట్టూ తిరిగిన చంద్రబాబునాయుడు ఒక్కసారి కూడా హోదా ప్రస్తావన చేయలేదని మండిపడ్డారు. కేంద్రం నుండి రూ.20 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటినీ తీసుకురావడం లేదని పేర్కొన్నారు. రెండేళ్లలో పూర్తిచేస్తామన్న వెలిగొండకు రూ.309 కోట్లు కేటాయించారని, ఇలాగైతే ఎప్పటికి పూర్తిచేస్తారని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం రూ.12 వేల కోట్లు ఇస్తామని చెబితే రాష్ట్ర బడ్జెట్లో మాత్రం రూ.6000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇంకతంటే అన్యాయం మరొకటి లేదని పేర్కొన్నారు. మహిళలనూ మోసం చేశారని, ఉచిత బస్సు పథకం ప్రస్తావన లేదని, నెలకు రూ.1500 ఇస్తామని చెప్పినా నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపారని, అవసరం లేకపోయినా అదానీకి కోట్లు కట్టబెట్టేందుకు మీటర్లు పెట్టారని, వాటిని ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. సెకీ ఒప్పందాన్ని రద్దుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేకుండా పోయిందని, చిన్నదేశం శ్రీలంక అదానీతో ఒప్పందాన్ని ధైర్యంగా రద్దు చేసుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్యుత్‌ భారాలు పడుతున్నాయని, అధికారంలోకి రాకుముందు శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని పక్కనబెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నిపై 8వ తేదీ నుండి ప్రజాచైతన్యయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో వారిని ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధికి నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం రూ.300 కోట్లు ఇచ్చిచేతులు దులుపుకుందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకూ నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు రూ.2000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిపై దృష్టి సారించకపోవడం అన్యాయమని అన్నారు. వేదవతి, గుండ్రేగుల, ఆర్‌డిఎస్‌ కుడికాలువకు కనీస స్థాయి నిధులు కూడా ఇవ్వలేదని, వెలుగొండ ప్రాజెక్టుకు ఏడాదికి రెండువేల కోట్ల చొప్పున రెండేళ్లపాటు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు రూ.309 కోట్లు కేటాయించి ప్రజలను మోసం చేశారని అన్నారు.

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org