ఈరోజు (01 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
మాటల కోతలు...నిధుల కోతలు...
ఎపి బడ్జెట్‌పై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
అంచనాల్లో ప్రజల ప్రాధాన్యత లేదు
లబ్దిదారులు, సంక్షేమ పథకాల్లో కోతపెట్టే ప్రమాదం
ప్రజా ప్రాధాన్యతతో అంచనాలు మార్చాలి
పోలవరం నిర్వాసితులకు తక్కువ కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025`26 బడ్జెట్లో మాటల కోతలు, నిధుల కోతలు తప్ప ప్రజల ప్రాధాన్యత లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. శనివారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. బడ్జెట్ అంచనాల్లో ప్రజలను పట్టించుకోలేదని, నిజాయితీ లేదని తెలిపారు. ఆదాయం పెరుగుతుందని చెప్పిన లెక్కలన్నీ మోసపూరితమని పేర్కొన్నారు. అంచనాలు ఎక్కువచేసి చూపించి సవరణ అంచనాల్లో తగ్గించేస్తున్నారని, ప్రతిసారీ ఇదే జరుగుతోందని, ఇటువంటి లెక్కలు ప్రజలను మోసం చేయడానికి తప్ప మరొకటికాదని విమర్శించారు. రూ.15 వేల కోట్ల సొంత పన్నులు పెరుగుతాయంటే ప్రజలపై భారం వేయడమేనని అన్నారు. పన్నేతర ఆదాయం రూ.7 వేల కోట్ల నుండి రూ.19 వేల కోట్లకు పెంచారని, వాటికోసం భూములు అమ్ముతారా ? ఎర్రచందనం అమ్ముతారా? సారా తాగించి తెస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మొత్తం పన్నుల్లో కేంద్రం వాటా రూ.52 వేల కోట్ల నుండి 57 వేల కోట్లకు పెరుగుతుందని తెలిపారని, 15 ఏళ్లలో ఐదువేల కోట్లు ఎప్పుడూ పెరగలేదని చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.10 వేల కోట్లు పెరుగుతుందని లెక్కల్లో చూపించారని గతంలోనూ ఇలా పెంచి చూపించడం సంవత్సరాంతంలో తగ్గించడం ప్రజలను మభ్యపెట్టడానికి కాదా అని ప్రశ్నించారు. సూపర్‌సిక్స్ పథకంలో బడ్జెట్ ప్రారంభంలోనే మూడు ఎగిరిపోయాయని, మిగిలిన మూడు పథకాలు సగం నిధులకే పరిమితం అయ్యాయని అన్నారు. అంటే లబ్దిదారుల్లో కోత పెట్టడం, సంక్షేమ పథకాలు కుదించడం, లేదా బకాయిలు పెట్టడం వంటి చర్యలకు దిగుతారని అన్నారు. మహిళల నిధులు లేవని, యువతకు ఉపాధి లేదని పేర్కొన్నారు. మొదటి సంతకం పెట్టిన డిఎస్‌సి మరలా వాయిదా వేసిన ప్రభుత్వం వర్గీకరణను సాకుగా చూపడం సరికాదని తెలిపారు. మొత్తం ఉద్యోగాలు ఎగ్గొంటేందుకు సాకుగా దీన్ని ఉపయోగించుకుంటున్నారని వివరించారు. రూ.48 వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్ చూపించి 22 శాతం గ్రోత్‌రేట్ ఉంటుందని చెప్పడం ద్వారా కడుపునింపే మాటలు చెప్పారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో పోలవరానికి ఆరువేల కోట్ల చూపించారని, అది పూర్తవ్వాలంటే రూ.60 వేల కోట్లు అవసరం ఉంటుందని అన్నారు. నిర్వాసితులకు రూ.30 వేల కోట్లపైబడి ఇవ్వాలని, అంచనాల పెరుగుదల ఉందని దానికి తగిన విధంగా కేటాయింపులు లేవని వివరించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వెలిగొండ, హంద్రీనీవా కూడా కేటాయింపులు సరిగా లేవని తెలిపారు. రూ.1400 కోట్లు ఖర్చు పెడితే వెలిగొండ టన్నెల్ పూర్తవుతుందని అలా చేయకుండా కాంట్రాక్టర్లకు కట్టబెట్టే కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. మార్చి నుండి మే నెల వరకూ పొయ్యిమీద పెనంలా ఉంటుందని వార్తలు వస్తున్నాయని, ఇప్పటికే 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారని, అంతే కాదని కోస్తా సహా తీవ్రపరిస్థితిని ఎదుర్కోబోతోందని అన్నారు. అయినా బడ్జెట్లో ఎక్కడా ప్రజలను ఆదుకునే లెక్కలు కనిపించడం లేదని విమర్శించారు. ఐదేళ్లు వాళ్లు దోచుకున్నారు, ఇప్పుడు మేము దోచుకుంటామనే విధంగా ప్రభుత్వ తీరు ఉందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో వాటాను పెంచాలని బడ్జెట్లో ఎక్కడా కేంద్రాన్ని కోరలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రం రాష్ట్రాలకు 32 శాతం వాటా ఇస్తోందని, దీన్ని 50 శాతానికి పెంచాలని అలా చేయకుండా రాష్ట్రాలను మోసం చేస్తుంటే నిధులు ఇవ్వాలని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర 50 శాతం వాటా రాష్ట్రాలకు ఇస్తే ఎపిలో చాలా వరకూ సమస్యలు తీరుతాయని చెప్పారు. అయినా రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నా దాని గురించి మాట్లాడకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో బడ్జెట్‌ను సవరించి నిధులు కేటాయింపులు చేయాలని కోరారు.
మూలధన వ్యయాన్ని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, గత ప్రభుత్వంలోనూ ఇదే పద్ధతి అనుసరించారని అన్నారు. పి4 పేరుతో పేదవాళ్లను ధనవంతులు దత్తత తీసుకునే కార్యక్రమం పెట్టారని, అక్కడ ఒక ‘పి’ ఎగిరిపోయిందని తెలిపారు. రూ.20 వేల కోట్లు వయబులిటీగ్యాప్ పండిరగ్ పేరుతో మరో ‘పి’ని ఎత్తేశారని అన్నారు. మొత్తంగా పి4 పేరుతో ప్రభుత్వం ప్రజల బాధ్యత నుండి తప్పుకునే కార్యక్రమం చేస్తోందని అన్నారు. పైగా వయబులిటీ గ్యాప్ ఫండిరగ్‌కు రూ.20 వేల కోట్లు కేటాయించారని, ఇవి ఉద్దేశపూర్వకంగా పెట్టుబడిదారులకు అప్పగించడమేనని స్పష్టం చేశారు. ఇది క్రోనీ క్యాపిటలిజానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
ఎంపి సీట్ల డీలిమిటేషన్‌పై
అఖిలపక్షం వేసి చర్చించాలి
బి.వి.రాఘవులు డిమాండు
అమిత్‌షా ప్రకటన మోసపూరితం
పార్లమెంటు సీట్ల పునర్విభజనపై అమిత్‌షా చేసిన ప్రకటన పచ్చి మోసపూరితమని, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించబోమన్న మాటలో నిజాయితీ లేదని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి అభిప్రాయం మేరకు అమోదయోగ్య ప్రక్రియ చేపట్టాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. బిజెపి పాలకులు వారు కోరుకున్న రాష్ట్రాలకు సీట్లు పెంచుకోవడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. జానాభా ప్రాతిపదికన విభజన చేస్తామని చెబుతున్నారని, అలా చేస్తే దేశం కోసం జనాభాను నియంత్రించి అభివృద్ధికి దోహదపడిన రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దేశాన్ని పట్టించుకోకుండా జనాభాను పెంచిన రాష్ట్రాలకు ఇన్సెంటివ్ ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. దీనిపై ఇప్పటికే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, తమిళనాడు సిఎం కూడా అదే ఆందోళన వ్యక్తం చేశారని, అంతకుముందు ఇతర ముఖ్యమంత్రులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ‘మీ సీట్లు తగ్గవు, ఇతరులకు పెరుగుతాయని’ షా చెప్పడం పచ్చిమోసమని అన్నారు. పార్లమెంటు సీట్లు పెంచాలనుకుంటే నిష్పత్తి ప్రకారం పెంచొచ్చని, లేదా ఇతర పద్దతులు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిశీలించొచ్చని సూచించారు. ఈ విషయం కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళుతోందని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా వాటి వైఖరి ప్రకటించాలని, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు బిజెపికి వంతపాడుతారా లేదా పార్లమెంటు సీట్లు తగ్గినా ఫర్వాలేదంటారా ప్రజలకు చెప్పాలన్నారు. గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం అందరికీ న్యాయమైన పద్ధతి అనుసరించాలని తెలిపారు. సీట్ల పెంపు సంఖ్యలో దామాషా పద్ధతి అనుసరిస్తే అన్ని రాష్ట్రాలకు మంచిదని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీట్లు పెరుగుతాయని చెబుతున్నారని, ఎక్కడ పెరుగుతాయో ? ఎలా పెరుగుతాయో చెప్పాలని ప్రశ్నించారు. అమిత్‌షా చెప్పిన దానిలో దామాషా పద్ధతి లేదని అన్నారు.