
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 28 ఫిబ్రవరి, 2025.
రూ. 3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తోడ్పడేదిగా లేదు. పైగా లక్షల కోట్లు అదనంగా అప్పు తేబోతున్నారు. మరో 80 వేల కోట్లు ద్రవ్యలోటు ఉంది. దాన్ని పూడ్చుకోడానికి ప్రజలపై అదనపు భారాలు వేసేదిగా ఉంది. పన్ను ఆదాయం 14 వేల కోట్లు, పన్నేతర ఆదాయం 12 వేల కోట్లు పెంచి చూపడం ద్వారా ఇది ప్రజలపై భారాలు పెంచుతుంది లేదా అనుకున్న ఆదాయం రాలేదంటూ పథకాలకు కోతపెట్టే ప్రమాదముంది. అన్ని పథకాలకు కేటాయింపులు చూపడం కోసం ఆచరణాత్మకం కాని ప్రతిపాదనలు చేసినట్లు అనిపిస్తోంది. ప్రజలకు పెను భారంగా మారిన విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల విధింపు గురించి ప్రస్తావించిన మంత్రివర్యులు రాష్ట్రాన్ని పాతికేళ్ళపాటు దోచుకుతినే సెకి ఒప్పందాన్ని రద్దు చేయడం గురించి పల్లెత్తు మాట అనకపోవడం దారుణం. ప్రతిపక్షంలో ఉండగా మీడియాకు పుంఖాను పుంఖాలుగా చెప్పడం, హైకోర్టుకు సైతం ఎక్కిన ప్రస్తుత ఆర్థిక శాఖా మంత్రి ఇప్పుడు ఈ అంశంపై పెదవి విప్పకపోవడం ప్రజలను వంచించడమే. వ్యవసాయం, ఇరిగేషన్, సంక్షేమ కార్యక్రమాలకు గత బడ్జెట్‌కన్నా పెరుగుదల పెద్దగా లేదు. పైగా తల్లికి వందనం కేటాయింపులు తగ్గాయి.
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలకు కేటాయింపులు చూపినా టిడిపి కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న యువతకు నిరుద్యోగ భృతి గురించి మాట మాత్రం ప్రస్తావించకపోవడం అన్యాయం. ఇప్పటికే మెగా డిఎస్సీ రాకపోవడం, గ్రూప్`2 పరీక్ష విషయంలో నిరాశ చెందిన యువతకు ఈ బడ్జెట్ హతాశులను చేసింది. ఆప్కాస్ రద్దు చేసి తిరిగి పాత కాంట్రాక్టు పద్దతి పునరుద్దరించడం ఉద్యోగులు, కార్మికుల్ని అభద్రతకు గురిచేస్తుంది. గత ఏడాది ఆందోళన చేసిన అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్ వర్కర్లకు ప్రతిపక్షంలో ఉండగా న్యాయం చేస్తామని చెప్పి, ఇప్పుడు అధికారానికి వచ్చిన కూటమి తాజా బడ్జెట్‌లో వారికి మొండిచెయ్యి చూపడం ‘‘ఏరు దాటే వరకు ఓడ మలయ్య..’’ సామెతను గుర్తు చేస్తోంది.
ఇరిగేషన్ కేటాయింపులు 14 వేల కోట్లు నుండి 17 వేల కోట్లకు పెరిగినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో ఇది 24.73% నుండి 23.98%కి తగ్గిందంటే తన వ్యయ ప్రాధాన్యత ఏమిటో విదితమవుతోంది. విద్యలో కూడా కేటాయింపులు 11.37% నుండి 10.8%కి, వైద్యానికి 6.2% నుండి 5.98%కి తగ్గించడం, మానవాభివృద్ధి సూచికల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి ఎలా ఉన్నదీ విదితమవుతోంది. అయితే బడ్జెట్‌లో దాదాపు మూడో వంతు మొత్తం 1.02 లక్షల కోట్లు అప్పుపైనే ఆధారపడిన స్థితిలో ఏది ఎంత వరకు ఆచరణకొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకవైపు అప్పులు, లోటు పెరుగుతున్నా మరోవైపు కార్పొరేట్లకు 20% వయబిలిటీ గ్యాప్ పేరుతో కేటాయించడం ప్రభుత్వం సంపన్నుల కొమ్ము కాస్తున్నదనడానికి నిదర్శనం. గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా అప్పుల ఊబి, భారాల మోత తప్పని స్థితిని ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి భారాలు పడకుండా ఎదుర్కోవాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి