పట్టభద్రుల ఎన్నిక- పోలింగ్‌ ఏజెంట్లు ఓటర్ల లిస్టులు తీసుకురావడానికి అనుమతి కోరుతూ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 ఫిబ్రవరి, 2025.

పట్టభద్రుల ఎన్నిక - పోలింగ్‌ ఏజెంట్లు ఓటర్ల లిస్టులు తీసుకురావడానికి
అనుమతి ఇవ్వాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా చర్యలు చేపట్టాలని సిపిఐ(యం)
రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
వై.వెంకటేశ్వరరావు లు వ్రాసిన వినతిపత్రాన్ని వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర
కమిటీ సభ్యులు జె.జయరాం ఛీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ను కలిసి ఇచ్చారు.
        ఓటర్ల లిస్టులు తీసుకురావడానికి నిబందనలు అనుమతిస్తాయని, అన్నిచోట్ల వెబ్‌
కెమెరాలు ఏర్పాటు చేస్తామని, సమస్యాత్మక ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు
తీసుకుంటామని హామీ ఇచ్చారు.

(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి

 

చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ గారికి,
ఆంధ్రప్రదేశ్‌,
వెలగపూడి.

విషయం : పట్టభద్రుల ఎన్నిక- పోలింగ్‌ ఏజెంట్లు ఓటర్ల లిస్టులు
తీసుకురావడానికి అనుమతి కోరుతూ...
ఆర్యా!
        ఫిబ్రవరి 22వ తేదీన గుంటూరులో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ గారు (కలెక్టర్‌)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నిర్వహించిన అభ్యర్థులు/ ఎలక్షన్‌
ఏజెంట్‌ల సమావేశంలో కొన్ని సూచనలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది.
(1)     అందులో ప్రధానంగా ఈనెల పోలింగ్‌ రోజున (ఫిబ్రవరి 27) ఎన్నికల్లో
పోటీచేసే అభ్యర్థుల తరపున ఆయా  బూత్‌లో ఉండే పోలింగ్‌ ఏజెంట్లు ఓటర్ల
లిస్టును తమతో తీసుకురాకూడదని చెప్పారు. వారికేమైనా ఓట్లు వేసేవారి పట్ల
అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే పోలింగ్‌ అధికారుల వద్ద రెండు లిస్టులు ఉంటాయని
వాటిని పరిశీలించాలని చెప్పారు.
        ఈ రకంగా సూచనలు చేయడం, దానిని అమలు చేయాలని భావించడం ఎలక్షన్‌ కమిషన్‌
అభ్యర్థులకు ఇచ్చిన హ్యాండ్‌ బుక్‌లో (12, 12.1, 13.1) నిబంధనలకు విరుద్దం.
ఈ రకంగా చేయడం వలన పోలింగ్‌ ఏజెంట్‌ల వ్యవస్థ నిష్ప్రయోజనం అవుతుంది.
అంతేకాకుండా ఇది కొంతమంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు మాత్రమే
తోడ్పడుతుంది. అభ్యర్థుల తరపున 25 మంది ఉన్నప్పుడు ఇటువంటి పద్దతి ఏరకంగానూ
ఆమోదయోగ్యం కాదు.
        తుది ఓటర్ల జాబితాలో కూడా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున డూప్లికేట్‌
ఓట్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎన్నికల రోజున వాటిని నివారించేందుకు
కూడా పోలింగ్‌ ఏజెంట్‌లు ఓటర్ల లిస్టు తీసుకెళ్ళడం తప్పనిసరి.
        అందువలన తక్షణమే తమరు జోక్యం చేసుకొని ప్రతి పోలింగ్‌ ఏజెంట్‌ ఎన్నికల
నిబంధనలకు అనుగుణంగా తనతోపాటు ఓటర్ల లిస్టును తీసుకు వెళ్ళేందుకు
అనుమతినిస్తూ తక్షణమే తగు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఆ నిబంధనలు
జతపరుస్తున్నాము.
(2)     ఎన్నికల రోజున స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేసేందుకు వీలుగా పూర్తి స్థాయి
భద్రతా మరియు నిఘా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. ప్రత్యేకించి పల్నాడు
జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం, అమరావతి మండలంలోని
గ్రామాలు, పెదకూరపాడు, బాపట్ల జిల్లా వేమూరు, అమృతలూరు మొదలగు ప్రాంతాల్లో
ఓటర్లు  రాకుండా నిరోధించే అవకాశం ఉంది. అలాగే భయబ్రాంతులను చేసే ప్రమాదం
కూడా ఉంది. అందువలన సిసి కెమెరాలు ఏర్పాటు చేసి సిఈవో కార్యాలయం నుండి
వీటిని పర్యవేక్షించి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేటట్లు తగు ఏర్పాట్లు చేయాలని
కోరుతున్నాము.
(3)     ఓటర్లను వివిధ రూపాలలో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ
నేపథ్యంలో వాటిని నివారించేందుకు విస్తృతంగా దళాలు ఏర్పాటు చేయాలని,
ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసేవారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

(వై.వెంకటేశ్వరరావు)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు