నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు ఎపిపిఎస్‌సిపై రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 ఫిబ్రవరి, 2025.

 

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు

ఎపిపిఎస్‌సిపై రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరి

- సిపిఐ(యం) ఖండన

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల విషయంలో అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా వారితో చర్చించి వారు లేవనెత్తిన రోస్టర్‌ సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

గత కొద్దిరోజులుగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసి రోస్టర్‌ పాయింట్స్‌లో జరిగిన లోటుపాట్లను సరిదిద్దాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వారిని చర్చలకు పిలిచి పరిష్కరించాల్సిన ప్రభుత్వం కోచింగ్‌ సెంటర్లమీద, ఆందోళనల్లో ఉన్న నిరుద్యోగుల మీద తప్పుడు ప్రచారానికి దిగడం గర్హనీయం. పరీక్షలు వాయిదా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు లీకులు వదిలి నిరుద్యోగులను భ్రమల్లో పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం దుర్మార్గం. ఏదో ఒక రకంగా న్యాయ వివాదంలో దించి రిక్రూట్‌మెంట్‌ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. మెగా డిఎస్సీని వాయిదా వేస్తున్న తీరు కూడా దీన్ని బలపరుస్తున్నది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్‌ విషయంలో జరిగిన లోటుపాట్లు సరిదిద్దేందుకు నిరుద్యోగులతో చర్చించాలి. ప్రతిష్టకు పోకుండా న్యాయ నిపుణులతో, విద్యావేత్తలు, మేధావులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి