
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 ఫిబ్రవరి, 2025.
చిరు వ్యాపారులపై విద్యుత్ వడ్డన ఉపసంహరించాలి
- సిపిఐ(యం) డిమాండ్
2025`26 ఆర్థిక సంవత్సరానికి ఎపిఇఆర్‌సి ప్రకటించిన విద్యుత్ టారిఫ్ (చార్జీలు) చిరు వ్యాపారులపై ‘టైమ్ ఆఫ్ డే’ పేరిట అదనపు భారం వేయడాన్ని సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఖండిస్తున్నది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, రిలయన్స్, క్రోమా, డి`మార్ట్ తదితర భారీ మాల్స్‌తో ఇప్పటికే చిల్లర వ్యాపారం తీవ్రంగా దెబ్బ తిన్నది. గ్రామాల్లో వ్యాపారాలు అంతంతమాత్రమే! ఇప్పుడు టైమ్ ఆఫ్ డే (టిఒడి) పేరిట సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు యూనిట్‌కు 50 పైసల నుండి రూపాయి వరకు అదనపు చార్జీ విధించడం దారుణం. ఆ భారం చిల్లర దుకాణాల కొనుగోలుదార్లపైనే పడుతుంది. కోవిడ్ అనంతరం వ్యాపారాలు పుంజుకోక, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చిరువ్యాపారుల సంక్షేమానికి రక్షణ చర్యలు చేపట్టడం మాని ఇలా కరెంటు చార్జీలు పెంచడం ప్రభుత్వానికి తగని పని. గంట గంటకూ రేటు మార్చడం కోసం వాడకాన్ని లెక్కగట్టడానికి స్మార్ట్ మీటర్ ఉంటేనే సాధ్యమౌతుంది. ఇటువంటి మోసపూరిత కండిషన్లు పెట్టి విద్యుత్ వినియోగదార్లకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అంటగట్టే కుట్ర ఇది. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన ఆర్‌డిఎస్‌ఎస్ షరతులను టిడిపి కూటమి ప్రభుత్వం ఈ విధంగా అమలుకు పూనుకోవడం క్షంతవ్యం కాదు. అలా మోడీ ప్రభుత్వ షరతుల అమలు, మరోవైపున అదానివంటి కార్పొరేట్లకు స్మార్ట్ మీటర్ల ద్వారా లబ్ధి చేకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంగా ఉంది. గత వైసిపి ప్రభుత్వం బాటలోనే కూటమి కూడా పయనించడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు చిరు వ్యాపారులకు అలవాటు చేసే టిఒడి రేట్లు ఆ తరువాత గృహ వినియోగదార్లపై కూడా వడ్డించక మానరు. టిఒడి పేరిట విద్యుత్ చార్జీల పెంపును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దొంగదెబ్బ తీసే ఇటువంటి భారాలను ప్రజలు వ్యతిరేకించాలని, నిరసనలు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి