‘ఉపాధి హామీలో’ జాబ్‌ కార్డులు భారీగా తొలగింపులు - వాటిని పునరుద్ధరించాలి,

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం.   - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 15 ఫిబ్రవరి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : ‘ఉపాధి హామీలో’ జాబ్‌ కార్డులు భారీగా తొలగింపులు - వాటిని పునరుద్ధరించాలి, వేతన బకాయిలు చెల్లింపు, అన్ని గ్రామాల్లో పనుల చేపట్టి, వలసలు నివారించాలని కోరుతూ..

అయ్యా!

వివిధ కారణాల పేరిట ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 సం॥లో 4,85,757, 2023-24సం॥లో 3,60,840 ఉపాధి హామీ జాబ్‌ కార్డులను రద్దు చేసినట్లు పార్లమెంటుకు ఫిబ్రవరి 4న సంబంధిత కేంద్రమంత్రి తెలిపారు. ఈ రెండేళ్లలో 8,46,597 మంది గ్రామీణ పేదలు తమ జాబ్‌ కార్డులు కోల్పోయారు. అకారణంగా లక్షలాదిమంది పేదలకు ఉపాధి పనులు ఆపేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ 18 సం॥ల నిండిన ప్రతి ఒక్కరికీ జాబ్‌ కార్డు పొందే హక్కు చట్టం కల్పించింది. ఈ కార్డుల్లో 2 లేదా 3 కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అందులో జాబ్‌ కార్డు పొందిన వ్యక్తి చనిపోయినా ఇతర కారణాల వల్ల ఆ జాబ్‌ కార్డు రద్దుచేస్తే మిగిలిన కుటుంబ సభ్యులు పని కోల్పోతారు. అదేవిధంగా ఉన్న ఊళ్లో వ్యవసాయ పనులు లేక సూదూర ప్రాంతాలకు నెలల తరబడి వలసలు పోయిన వారి జాబ్‌ కార్డులు రద్దుచేసినవి గణనీయంగా ఉన్నాయి. రాష్ట్రంలో వీరిలో కొద్ది వేల మంది మాత్రమే మరణం కారణంగా తొలగించదగినవి తప్ప అత్యధిక భాగం కార్డులను తొలగించడం అన్యాయం. ఇపుడు వారు ఉపాధి హామీ పని చెయ్యాలంటే కార్డు రద్దయిపోందని సూపర్‌వైజర్లు పనిలో చేర్చుకోవడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో వేసవి మొదలైంది. పనుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. మార్చి నుంచి జూన్‌ దాకా ఉపాధిహామీ పనులే పేదలకు ఆధారం. కాబట్టి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ జాబ్‌ కార్డు, కుటుంబంలో పెళ్లైన వారికి కూడా జాబ్‌ కార్డులు లేక పని కోల్పోతున్నారు. కనుక తమరు చొరవ తీసుకుని అర్హులైన వారందరి కార్డుల్ని పునరుద్దరించాలని, లేదా కొత్త కార్డులు మంజూరు చేయుటకు  సంబంధిత శాఖలకు ఉత్తర్వులీయాలని కోరుతున్నాను.

రాష్ట్రంలో ఉపాధి పనుల కనీస వేతన బకాయిలు 2025 జనవరి 27 నాటికి రూ.67.35 కోట్లున్నట్లు సదరు మంత్రివర్యులు తెలిపారు. ఇవే కాక సంబంధిత జిల్లాలలో కూలీలకు చెల్లించకుండా సస్పెన్షన్‌ అకౌంట్‌లో వంద కోట్లుకు పైగా బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించుటకు తగు ఉత్తర్వులిచ్చి, గ్రామీణ పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాను.

 

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి