1/70పై ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్ధతు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 10 ఫిబ్రవరి, 2025.

 

1/70పై  ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్ధతు

1/70 చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 11,12 తేదీలలో జరుగుతున్న ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్దతు తెలియజేస్తున్నది. 1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్‌ వ్యాఖ్యలపై గిరిజనుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకూ తన వైఖరిని స్పష్టం చేయకపోవడం వల్ల గిరిజనుల్లో ఇంకా ఆందోళన పెరుగుతోంది. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయాలని డిమండ్‌ చేస్తున్నది. బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రశాంతంగా సాగే బంద్‌ను శాంతి భద్రతల సమస్యగా మార్చవద్దని, వెంటనే నోటీసులు ఉపసంహరించుకొని, బంద్‌ శాంతియుతంగా జరిపేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 

ఏజెన్సీ ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యూలు కిందకు వస్తుంది. దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వీటిని వెంటనే అరికట్టాలి. ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుంది. ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తున్నది.

కాబట్టి 1/70 చట్టాన్ని సవరించే ప్రయత్నాన్ని ప్రజాతంత్రవాదులు, మేధావులు అడ్డుకొని గిరిజనులకు అండగా నిలవాలని, బంద్‌కు మద్దతు ఇవ్వాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి