
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 ఫిబ్రవరి, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : 1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ...
అయ్యా!
ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని 27వ తేదీన విశాఖపట్నంలో జరిగిన జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా శాసనసభ స్పీకర్ గౌ॥ అయ్యన్నపాత్రుడు గారు ప్రకటించారు. ఈ ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయాల్సింది పోయి సవరించాలని చెప్పడం ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యూలు కిందకు వస్తుంది. దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుంది.
1/70 చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చింది. 2006`07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం వామపక్ష పార్టీల ఒత్తిడిపై అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది. భూమిపై గిరిజనుల హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసింది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూముల్ని బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తున్నది. పంప్డ్ స్టోరేజీ హైడల్ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆదివాసీ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. వీటిని వెంటనే అరికట్టాలి.
ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలు 1/70ని సవరిస్తే మరింత వెనకబడిపోతాయి. తక్షణం ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని, 1/70 చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి గిరిజన వ్యతిరేక ప్రకటనలు చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలను అదుపు చేయాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org