భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 జనవరి, 2025.
సిపిఐ(యం) నాయకులపై గృహ నిర్బంధాన్ని ఖండించండి
ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిపిఐ(యం) నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధంలో పెట్టడాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో సిపిఐ(యం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును, అచ్యుతాపురంలో జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రాము, కె.సోమునాయుడు, కె.కోటపాడులో యర్రా దేముడు, రాంబిల్లిలో జి.దేముడు నాయుడు, చీడికాడలో ఆర్. దేముడు నాయుడు, కశింకోటలో డి.డి.వరలక్ష్మి, డి.శ్రీను, నక్కపల్లి రాజయ్యపేటలో నాయకులు, మహేష్, బయ్యన్న, జాను లను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచడం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం. విశాఖ ఉక్కును బలిచేసి అనకాపల్లిలో మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు నడుం కట్టడాన్ని సిపిఐ(యం) వ్యతిరేకిస్తున్నది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఇనుప గనులు కేటాయింపు, సెయిల్‌లో విలీనం, 18 వేల కోట్లు ప్యాకేజీ సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుంది. నక్కపల్లిలో భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీలు ఇవ్వకుండా పోలీసులను మోహరించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి బల్క్ డ్రగ్‌కోసం పనులు పెట్టాలని చూస్తుంది. తామ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని, నక్కపల్లిలో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేడు ఆ సమస్యలను పరిష్కరించ కుండా సిపిఐ(యం) నాయకులను గృహ నిర్భందించడమంటే ప్రజాస్వామ్య హక్కులను ఖూనీచేయడమే. జిల్లాలో పిఎం, సిఎం, రాష్ట్ర మంత్రులు పర్యటనలు సందర్భంగా ముందుగా సిపిఐ(యం) నాయకులను నిర్భందించడం, అరెస్టులు చేయడం పరిపాటిగా మారింది. గతంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌గారు ఎటుంటి అరెస్టులు, గృహ నిర్భందాలు వుండవని గొప్పగా ప్రకటించి, నేడు సిపిఐ(యం) నాయకులను ఎక్కడిక్కడ నిర్భందాలు విధించడమంటే వారి మాటలకు చేతలకు ఎంత తేడా వుందో అర్థమవుతుంది. సిపిఐ(యం) నాయకులను అరెస్టు చేయడం అంటే ప్రజల పట్ల, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో అర్ధమౌతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలేదని, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయడంలేదని ప్రకటించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తోంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి