భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 జనవరి, 2025.
విద్యుత్ ఛార్జీల పెంపుదల లేదంటూనే
ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం, పంపిణీ సంస్థలు
విద్యుత్ నియంత్రణ మండలికి అభ్యంతరాలు తెలిపిన సిపిఐ(యం) ఆంధ్ర ప్రదేశ్
కమిటీ
2025-26 సంవత్సరాలకు సంబంధించి ఎఆర్‌ఆర్ మరియు టారిఫ్ ప్రతిపాదనలపై
పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా నోటిఫికేషన్లు విడుదల
చేశారు. అభ్యంతరాలు తెలుపవలసిందిగా కోరారు. ఈ నెల 7,8,10 తేదీలలో బహిరంగ
విచారణ జరుపుతున్నారు. బహిరంగ విచారణలో సిపిఐ(యం) ప్రతినిధులు విజయవాడ,
కర్నూలులో పాల్గొని తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను తెలుపనున్నారు. ఈ
సందర్భంగా సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఈక్రింది అంశాలను రెగ్యులరేటరీ కమిషన్
దృష్టికి తీసుకువస్తున్నది.
= స్మార్ట్ మీటర్ల నిలిపివేయాలి, ఒప్పందాలను రద్దు చేయాలి.
= వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వం,
పంపిణీ సంస్థల ప్రతిపాదనలను గుడ్డిగా ఆమోదించడం, ప్రజల అభిప్రాయాలను
పరిగణనలోకి తీసుకోపోవటం బాధాకరం.
= ఇప్పటికైనా గతంలో వేసిన భారాలు రద్దు చేయాలని, కొత్త భారాలు వేయవద్దని,
స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని, అదానీ సంస్థతో చేసుకున్న సోలార్
విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతున్నాం.
= సంస్థల ప్రతిపాదనలపై సిపిఐ(యం) డిసెంబర్ 21,27,28 తేదీల్లో 33 పేజీలతో
కూడిన పత్రాలను వ్రాతపూర్వకంగా మండలకి తమ అభిప్రాయాలను తెలిపింది.
= విద్యుత్ నియంత్రణ మండలికి సిపిఐ(యం) తెలిపిన అభ్యంతరాలు అభిప్రాయాలు
ముఖ్యమైనవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
= 2025-26 సంవత్సరంలో భారాలు లేవంటూనే సర్దుబాటు చార్జీల ద్వారా వేలాది
కోట్ల రూపాయల భారం ముందుగానే మోపారు. భవిష్యత్తులో కూడా మరింతగా మోపటానికి
సిద్ధమవుతున్నారు.
= పంపిణీ సంస్థలు విద్యుత్ మిగులు, భవిష్యత్తు అవసరాలపై తప్పులు తడకలతో
అంచనాలు రూపొందిస్తున్నారు.
= 2024 -25 సంవత్సరంలో సంస్థల ప్రతిపాదనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని
అనుభవం తెలుపుతున్నది.
= బడా కంపెనీలకు మేలు చేసే విధంగా ప్రైవేట్ సంస్థల నుండి విద్యుత్
కొనుగోలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనాలు రూపొందిస్తున్నారు.
= ప్రభుత్వం చెల్లించవలసిన సబ్సిడీలను కుదించి చూపి భవిష్యత్తులో సర్దుబాటు
చార్జీలపై భారం మోపటానికి వాస్తవ విరుద్ధ ప్రతిపాదనలు ప్రజల ముందు
ఉంచుతున్నారు.
= కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్పొరేట్లకు మేలు చేసే చర్యల వలన
ప్రజలపై విద్యుత్ భారాలు పడుతున్నాయి.
= రెన్యువబుల్ ఎనర్జీ పేరుతో అధిక రేట్లతో అవసరానికి మించి విద్యుత్
కొనుగోలు చేయటం వల్ల వేలాది కోట్ల రూపాయల భారం పడుతున్నది,
= ఈ పేరుతో ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో విద్యుత్ ఉత్పాదనలో కోత
పెట్టి వాటిని దెబ్బతిస్తున్నారు.
= మరోవైపు స్వల్పకాలిక కొనుగోళ్ల పేరుతో వేలాది కోట్ల రూపాయలు బడా
కంపెనీలకు కట్టబెడుతూ ప్రజలపై దొడ్డిదారిన సర్దుబాటు చార్జీలు
పెంచుతున్నారు.
= అధిక రేట్లకు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో చేసుకున్న దీర్ఘకాలిక పీపీఏలు
తీవ్ర హాని చేస్తున్నాయి.
= కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగి గతంలోని రాష్ట్ర ప్రభుత్వం సెకి ద్వారా
అదాని సంస్థల నుండి సోలార్ విద్యుత్ కొనుగోలు చేసే దీర్ఘకాలిక ఒప్పందం
చేసుకోవడం ప్రమాదకరం.
= గత ప్రభుత్వంలోని పెద్దలకు 1750 కోట్ల రూపాయల మడుపులు ఇచ్చి, అధిక
రేట్లకు 25 సంవత్సరాలు సోలార్ విద్యుత్ సరఫరా చేసే ఒప్పందాలు అక్రమమని,
అవినీతిమయమని అమెరికా కోర్టులలో సాక్షాధారాలతో కేసులు నమోదయ్యాయి.
= అయినా కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేయకుండా కొనసాగించడం శోచనీయం
ఏవిద్యుత్ నియంత్రణ మండలి సేకి ద్వారా చేసుకున్న అదానీ సంస్థల సోలార్
ఒప్పందాలను రద్దు చేయాలి. బహిరంగ విచారణ జరపాలి. తాజాగా టెండర్లు తెలవాలి.
= అదానీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ
ఆదేశాలకు లొంగి వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు, చిన్న, మధ్యతరగతి
వ్యాపార సంస్థలకు, వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి
పూనుకోవడం ప్రజా వ్యతిరేకం.
= పారదర్శకత లేకుండా, గోప్యంగా, బహిరంగ విచారణ కూడా జరపకుండా స్మార్ట్
మీటర్లకు అనుమతి ఇవ్వటం తీవ్ర అభ్యంతరకరం.
= వినియోగదారుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా మీటర్లు బిగించడం చట్ట విరుద్ధం.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి