బెనిఫిట్‌ షో లపై జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలి. - సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జనవరి, 2025.

 

బెనిఫిట్‌ షో లపై జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలి

సిపిఎం డిమాండ్‌

రెండు సినిమాలు కొత్తగా విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమాల టిక్కెట్ల ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

ఈ జీవో ద్వారా బెనిఫిట్‌ షో అనే దాని అర్థమే మారిపోతున్నది. బెనిఫిట్‌ షో అంటే తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదో ఒక సామాజిక కార్యక్రమానికి వినియోగించేయాలి. కానీ తద్విరుద్ధంగా ప్రేక్షకుల అభిమానాన్ని లాభంగా మలుచుకోవటానికి మొదటి వారం రోజుల్లో టిక్కెట్లు ధర పెంచడం దారుణం. అదీ కొన్ని ప్రత్యేక సినిమాలకే ప్రభుత్వ విచక్షణపై అనుమతించడం సరైనది కాదు. సినిమా నటుల అభిమానులకు ప్రత్యేకంగా చూపించదల్చుకుంటే టిక్కెట్ల ధరపై రాయితీ ఇవ్వాలి. లేదా ఉచితంగా చూపించాలి తప్ప ధరలు పెంచడం అభిమానాన్ని దుర్వినియోగం చేయటమే.

టిక్కెట్ల ధర విషయంలో ఒక విధానం వుండాలి. అది అన్ని సినిమాలకు అందరికీ అన్ని రోజులకి ఒకేలా ఉండాలి. వినోదాన్ని వ్యాపారంగా మార్చి డిమాండ్‌ సప్లైని బట్టి టిక్కెట్‌ ధరలు పెంచుతామనడం అభిమానాన్ని దారుణంగా దోపిడీ చేయటమే. చిన్న సినిమాలను, చిన్న నిర్మాతలను దెబ్బకొట్టే ఈ విధానాలు మంచివి కాదు. టిక్కెట్లు పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏదైనా సామాజిక కార్యక్రమాలకి వెచ్చిస్తేనే బెనిఫిట్‌ షోలకు అనుమతించాలి. లాభాపేక్షతో అభిమాన ప్రేక్షకులపై ధరలు పెంచి భారం మోపడం జరిమానా విధించటం లాంటిదే.

అభిమాన ప్రేక్షకులపై భారాన్ని తగ్గించాలని, బెనిఫిట్‌ షోలు ద్వారా లేదా టికెట్లు పెంపుదల ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించే విధంగా చట్టంచేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. కాబట్టి తక్షణం ఈ జీవోను ఉపసంహరించుకోవాలి.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి