భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్దరించి 5సం॥లుగా పెండిరగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను చెల్లించేలా చర్యలు చేపట్టమని కోరుతూ..వెలుగు యానిమేటర్ల (వి.ఓ.ఎ)ల ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు తదితర సమస్యలు పరిష్కరించమని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 (1)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 26 డిసెంబర్‌, 2024. 

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం  : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్దరించి 5సం॥లుగా పెండిరగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను చెల్లించేలా చర్యలు చేపట్టమని కోరుతూ..

ఆర్యా!

 

మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది  భవన నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. గత 5సం॥లుగా ప్రభుత్వం ఇసుక విధానంపై అవలంభించిన విధానం వలన సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ బోర్డు నుండి పధకాలు అమలు కావడం లేదు. సంక్షేమ బోర్డులో పెండిరగ్‌లో ఉన్న క్లైయిమ్స్‌ అన్నింటినీ వెంటనే చెల్లించాలని, సంక్షేమ బోర్డు నుండి ప్రభుత్వం వాడుకున్న సొమ్ములను జమ చేయాలని, వసూలు చేయాల్సిన నిధి బకాయిలను సంబంధిత సంస్థల నుండి వసూలు చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నిధులున్నా అమలు చేయాల్సిన సంక్షేమ పధకాలను ఆపడం వలన కార్మికులు నష్టపోతున్నారు. దీనివలన చనిపోయిన, గాయపడిన కార్మికులకు మరియు ఇతర క్లైయిమ్‌లకు ఎటువంటి పరిహారం అందడం లేదు. కోట్లాది రూపాయల నిర్మాణాలు, రోడ్లు నిర్మిస్తున్న కాంట్రాక్ట్లం నుండి వసూలు చేయాల్సిన భవన నిర్మాణ సెస్‌ను వసూలు చేయడం లేదు. ఈ సెస్‌తోనే కార్మికులకు సంక్షేమ పధకాలు అమలు చేయాలి. ఈ సెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది ఏమీలేదు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులోని నిధిని ప్రభుత్వాలే పక్కదోవ పట్టించాయి.

కావున పై అంశాలను పరిశీలించి పెండిరగ్‌ క్లైయిమ్‌లను తక్షణమే చెల్లించేలా, 50 సం॥లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టమని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

 

 

 (2)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 26 డిసెంబర్‌, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం  : వెలుగు యానిమేటర్ల (వి.ఓ.ఎ)ల ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు తదితర సమస్యలు పరిష్కరించమని కోరుతూ..

ఆర్యా!

 

రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు యానిమేటర్లు (వి.ఓ.ఎ)లు గ్రామీణ ప్రాంతాలలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. వీరంతా గ్రామ సంఘాల, మహిళా పొదుపు సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక రకాల సేవలను వీరంతా అందిస్తున్నారు. కానీ కనీస వేతనాలను వీరికి చెల్లించడం లేదు. రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, టిఎ, డిఎ సౌకర్యం కల్పించాలని సిపిఐ(ఎం) కోరుతున్నది.

రంపచోడవరం పరిధిలో ఉన్న 11 మండలాల్లో 7నుండి 17 నెలల వేతన బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులు అధికారులకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. మహిళా మార్టుల పేరుతో బలవంతంగా సరుకుల కొనుగోళ్ళు చేయిస్తున్నారు. ఈ సమస్యలన్నీంటినీ వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి