భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 డిసెంబర్, 2024.
సింగిల్ ఎంట్రీ విధానంలో టోల్ ఛార్జీల బాదుడు రద్దు చేయాలి.
- సిపిఐ(యం)
రాష్ట్రంలో 65 టోల్ ప్లాజాల వద్ద సింగిల్ ఎంట్రీ విధానంతో వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుముల భారాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. కాంట్రాక్టర్లకు టోల్ పేరుతో కట్టబెడుతున్నా రోడ్ల నిర్వహణ నాసిరకంగా ఉంది. దీనికితోడు ఆర్Êబి రోడ్లపై కూడా టోల్ ప్రవేశ పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది పెనుభారం అవుతుంది. ఈ మొత్తం టోల్ విధానాన్ని సమీక్షించి తక్షణం భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలో మొత్తం 69 టోల్ ప్లాజాలు ఉంటే, వాటిలో 65 టోల్ ప్లాజాలలో సింగిల్ ఎంట్రీ విధానం తీసుకువచ్చి రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు టోల్ రుసుములు పూర్తిస్థాయిలో వసూలు చేసి వాహనదారులపై కేంద్రప్రభుత్వం భారం మోపుతున్నది. ఈ విధానం వలన అద్దె వాహనాలు నడుపుకునేవారిపై తీవ్ర ప్రభావం పడి జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. దగ్గర దగ్గర రెండు నగరాల మధ్య తిరిగే డైలీ వాహనాదారులకు మోయలేని భారం ఇది.
ఉదా: గుంటూరు - విజయవాడ మధ్య గత సెప్టెంబరు వరకు ఒకకారు ఒకసారి వెళ్లి తిరిగివచ్చినందుకు రూ.160లు చెల్లించేవారు. ఒకసారి టోల్ చెల్లించిన తరువాత 24 గంటల్లో ఎన్నిసార్లు తిరిగినా రుసుము చెల్లించాల్సినవసరం లేదు. కాని కొత్త నిబంధనల ప్రకారం రూ.160లను రూ.240లకు పెంచారు. ఈవిధంగా రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు రూ.240లు చెల్లించాల్సిందే. ఇదే విధంగా అన్ని రకాల వాహనదారులపై భారం పడుతుంది. సిఆర్‌డిఎ పరిధిలో టోల్ ప్లాజాలను ఎత్తివేయాలి.
20కి.మీ లోపల తిరిగే వాహనాలకు గతంలో పసుపు, తెలుపు బోర్డుల పేరుతో పాస్‌లు ఇచ్చేవారు. వీటికి నెలకు రూ.340లు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు పసుపు బోర్డుకు (అద్దె వాహనాలు) పాస్‌లు పూర్తిగా రద్దు చేశారు. తెలుపు బోర్డు వాహనాలపై రుసుములు పెంచారు. దీనివలన సొంత వాహనదారులపై కూడా భారం పెరగనున్నది. ఆర్‌టిసి పై అదనపు భారం పడుతుంది. ప్రజారవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి