పిఎం జన్‌మన్‌ లబ్ధిదారుల ఇళ్లు నిర్మాణానికి యూనిట్‌ కాస్ట్‌ పెంచాలని కోరుతూ

విజయవాడ,

తేది : 13 డిసెంబర్‌, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం  : పిఎం జన్‌మన్‌ లబ్ధిదారుల ఇళ్లు నిర్మాణానికి యూనిట్‌ కాస్ట్‌ పెంచాలని కోరుతూ..

అయ్యా!

ప్రత్యేకంగా వెనుకబడిన ఆదివాసీ తెగలు (పివిజిటి)ల అభివృద్ధికి 2023 నవంబర్‌లో  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పిఎం - జన్‌మన్‌) పథకానికి రాష్ట్రంలో  కోందు, పోర్జ, గదబ, చెంచు, కొండరెడ్డి, సవర, తొటి (పివిటిజి) తెగలైన వీరు అర్హులు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మరియు శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో పివిటిజి తెగలు జీవిస్తున్నారు. పిఎం - జన్‌మన్‌ పథకంలో పేర్కొన్న 12 రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను త్వరితగతిన లబ్ధిదారులకు అందించాలని కోరుతున్నాను. 

భారత రాజ్యాంగంలో అధికరణ (ఆర్టికల్‌ 275 క్లాజ్‌ -1 క్రింద షెడ్యూల్డ్‌ తెగలు లేదా షెడ్యూల్డ్‌ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మేలైన సదుపాయాలు కల్పించడంలో, కీలకమైన అంతరాలు భర్తీ చేయడానికి కావలసిన నిధులను విడుదల చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పివిటిజి తెగలు అభివృద్ధి చేయుటకు గత ప్రభుత్వాలు అమలు చేసిన కన్జర్వేషన్‌-కమ్‌-డెవలప్‌మెంట్‌ ప్రణాళిక (సిసిడిపి) స్థానంలో పిఎం - జన్‌మన్‌ పథకాన్ని అమలుకు ప్రభుత్వం పూనుకున్నది. పిఎం జన్‌మన్‌ పథకంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వాటాగా 2 లక్షల 39 వేల రూపాయలు ఒక ఇళ్లు నిర్మాణానికి యూనిట్‌ కాస్ట్‌గా నిర్ధారించి పథకం అమలు చేస్తుంది. అత్యంత వెనకబడిన, మారుమూల ప్రాంతాల్లో, కొండలపై నివసించే పివిటిజి తెగలు ఇళ్లు నిర్మాణం తీవ్రమైన భారమైంది. మార్కెట్‌లో రవాణా ఖర్చుతో ఇసుక ధర పెరిగింది.  సిమెంటు, ఇనుము మొదలగు ఇళ్లు నిర్మాణ సామాగ్రి ధరలు అధికమైంది.  పివిటిజి తెగలు అడవిపై ఆధారపడి జీవిస్తున్న వీరికి  కనీసం కూలీకెళ్లి డబ్బులు కూడబెట్టి ఇళ్లు నిర్మించుకొనే అవకాశం కూడా ఏజెన్సీ ప్రాంతంలో లేదు. ప్రభుత్వం కేటాయించిన 2 లక్షల 39వేల రూపాయలతో ఇళ్లు నిర్మాణం సాధ్యంకాదు. నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇళ్లు నిర్మాణానికి యూనిట్‌ కాస్ట్‌ను 5 లక్షల రూపాయలకు పెంచాలని, ఇప్పటికే ఇళ్లు నిర్మాణం చేసుకుంటున్న వారికి పెండిరగ్‌ బిల్లులు సకాలంలో చెల్లించాలని, ఇళ్ళ నిర్మాణం ప్రారంభానికి వీలుగా అడ్వాన్సు చెల్లించాలని  కోరుతున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి