
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 నవంబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : కార్మిక సంక్షేమం, ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై దృష్టి పెట్టి
తక్షణం సమీక్ష నిర్వహించాలని కోరుతూ...
అయ్యా!
రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగుతూనే
ఉంది. ప్రత్యేకించి అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్
పరిశ్రమల్లో ఈ ప్రమాదాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. పరవాడలోని ఠాగూర్
ఫార్మా కంపెనీలో(యూనిట్-3) 27వ తేదీ జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.
26 మంది అస్వస్థతకు గురయ్యారు. ఠాగూర్ యాజమాన్యం ఈ ప్రమాదం పట్ల తీవ్ర
నిర్లక్ష్యం వహించింది. సకాలంలో వైద్యం అందినట్లయితే ఇంత తీవ్రత ఉండేది
కాదు. కనీసం ప్రమాదం జరిగిన విషయాన్ని ప్రభుత్వ యాత్రాంగానికి తెలియకుండా
రహస్యంగా ఉంచింది. గత ఐదారు మాసాలలోనే దాదాపు 18 పారిశ్రామిక ప్రమాదాలు
జరిగాయి. సానుభూతి ప్రకటించి ఎంతో కొంత సహాయం ప్రకటించి ప్రభుత్వం చేతులు
దులుపుకుంటున్నది. ఇది న్యాయ సమ్మతం కాదు. ఫార్మా కంపెనీల్లో సోషల్ ఆడిట్
తక్షణమే నిర్వహించి, ఒక్క ఫార్మా కంపెనీలో కూడా ప్రమాదం జరగకుండా
నివారించాలి. కార్మిక చట్టాలను అమలు చేయకుండా యాజమాన్యాలు వాటిని తుంగలో
తొక్కుతున్నా కార్మికశాఖ పట్టించుకోవడం లేదు. కార్మిక శాఖ పట్టించుకోవడం
లేదు. కార్మిక శాఖ యాజామాన్యాల ప్రయోజనాలకనుగుణంగా వ్యవహరిస్తున్నది.
అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్
బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన కార్మిక సంక్షేమం
బలవుతున్నది. కార్మిక సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం వలె ఈ ప్రభుత్వం కూడా
తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని చెప్పటానికి విచారిస్తున్నాను.
ప్రతిరోజు ఏదో ఒక శాఖను సమీక్షిస్తున్న మీరు ఇంతవరకు కార్మిక శాఖ
సమీక్షించక పోవడం విచారకరం. తక్షణం కార్మిక శాఖ సమీక్ష చేపట్టి, ప్రమాదాల
నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని, ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాల మీద
చర్యలు తీసుకోవాలని, సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి
చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org