భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 నవంబర్, 2024.
దాగుడుమూతలు ఆపి అదానితో ఒప్పందాలు తక్షణమే రద్దు చేయండి.
- సిపిఐ(యం) డిమాండ్
వేలకోట్ల రూపాయల లంచాలు మెక్కి, సెకీ ద్వారా అదాని కంపెనీలతో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న అక్రమ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయవలసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం రాష్ట్ర ప్రభుత్వ అసలు నైజాన్ని బైటపెడుతున్నది. అధ్యయనమంటూ కాలయాపన చేసి ఇంత పెద్ద కుంభకోణాన్ని మరుగుపర్చాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ అవినీతిపె రంకెలు వేస్తూ ఇప్పుడు అదానికి తల వంచడం సిగ్గుచేటు. అదాని గ్రూపు సంస్థల నుంచి 1,750 కోట్లు ముడుపుల తీసుకొని సెకీ నుండి యూనిట్ 249 పైసల చొప్పున కొనుగోలు చేయాలని గత రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అమెరికా న్యాయస్థానంలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే వాటిని రద్దు చేయాలి. అలా చేయకుండా ఆ ఒప్పందాలపై టిడిపి కూటమి సర్కారు పునరాలోచన చేస్తున్నట్టు, రాజస్థాన్లో ఉత్పత్తి చేసిన కరెంటు బదులు ఆంధ్రప్రదేశ్‌లో అదాని ప్లాంట్ ఏర్పాటు చేస్తే అంతర్రాష్ట్ర రవాణాచార్జి తగ్గిపోతుంది కనుక చౌకగా కరెంటు వస్తుందని ప్రజల్ని నమ్మించడానికి పత్రికల్లో కట్టుకధలు రాయిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అవి వాస్తవమా? కాదా? ప్రభుత్వం చెప్పాలని కోరుతున్నాను. సెకీ ఒప్పందాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు కూడా లీకులు వచ్చాయి. అవి ఏవీ సాధ్యం కాకపోతే రేటు తగ్గించి విద్యుత్ ఇవ్వండంటూ అదానీ కంపెనీలనే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని ఒక మంత్రి చెప్పడం సిగ్గుచేటు. ఇవన్నీ ప్రజలను మభ్యపుచ్చి గందరగోళానికి గురి చేసేవే. రాష్ట ప్రభుత్వం దాగుడుమూతలు మాని తక్షణం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నిటిని రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org