(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 నవంబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయడం గురించి...
అయ్యా!
29.11.2024వ తేదీన ముగ్గురు మంత్రులు ప్రాజెక్టును సందర్శించి మరో 2
సంవత్సరాలలో ప్రాజెక్టును పూర్తిజేస్తామని జేసిన ప్రకటననుజూసి, అది ప్రజలను
మరోసారి మభ్యపెట్టేందుకు జేసినదా లేక పూర్తి అవగాహనతో జేసిన ప్రకటనా అని
తెలుసుకోవాలని నేను మరోసారి 12.11.2024వ తేదీన ప్రాజెక్టు వద్దకు వెళ్ళి
పరిశీలించాను.
ప్రాజెక్టు పనులను పరిశీలించి తిరిగి వచ్చేప్పుడు అక్కడ గత ప్రభుత్వం
06.03.2024 తేదీలో ‘జంట సొరంగాలు జాతికి అంకితం’ అని వేసిన
శిలాఫలకాన్నిజూసి ఆశ్చర్యపోయాను. ప్రాజెక్టు పూర్తికాకముందే అసెంబ్లీ
ఎన్నికలలో లబ్ది పొందేందుకు వై.ఎస్.ఆర్.పి. ప్రభుత్వం ప్రజలను
మభ్యపెట్టేందుకు జేసిన కపటనాటకం ఆ శిలాఫలకం. ఇప్పుడు మంత్రులుజేసిన ప్రకటన
కూడా ఆ కోవలోకి రాకూడదని కోరుకుంటున్నాను.
వెలిగొండ ప్రాజెక్టును 1996లో మీరు శంఖుస్థాపనజేశారు. ఇప్పటికి 28
సంవత్సరాలయ్యింది. ఈ కాలంలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీల ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఇందులో మీ ప్రభుత్వం 14
సంవత్సరాలు అధికారంలో ఉన్నది. అయినా ఈ ప్రాజెక్టుకు ముక్తి లభించకపోవడం
పాలక పార్టీలు ఒక వెనకబడిన, వర్షాభావ షాడో జోన్ ప్రాంతాన్ని ఎంత
నిర్లక్ష్యంజేశాయో వెల్లడిస్తున్నది.
ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.6,062.88 కోట్లు ఖర్చయ్యాయని ఇంకా రూ. 3,595
కోట్లు కావాలని (ప్రాజెక్టును పూర్తి చేయడానికి) ప్రభుత్వ లెక్కలు
చెబుతున్నాయి. ప్రారంభం అంచనా ప్రకారం ప్రాజెక్టుకు 980 కోట్లు అవుతుంది.
ప్రభుత్వాల నిర్లక్ష్యాలు, కాలయాపన మూలంగా ఎంతో చవకగా అయిపోవాల్సిన
ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది.పాత విషయాలను వదిలేసి, మంత్రులు
చెప్పినట్లు రెండేళ్ళలో పూర్తిజేయాలన్నా రూ.3000 కోట్లు కావాలి. ఈ
కేటాయింపు చేయకపోతే వ్యయం ఇంకా పెరిగిపోతుంది.
ఈ సంవత్సరం కనీసం రూ.1500 కోట్లన్నా కేటాయించి ఉంటే మంత్రుల మాటపై ప్రజలకు
నమ్మకం కల్గేది. కానీ బడ్జెట్‌లో రూ.394 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ
రకంగా ప్రతి సంవత్సరం కేటాయింపులు చేస్తారనుకుంటే ప్రాజెక్టు
పూర్తికావడానికి 8 సంవత్సరాలు పడుతుంది. మొదటి నుంచి జూస్తే డబ్బు
కేటాయింపు కాంట్రాక్టర్ల అవసరాలకోసం జరుగుతున్నది తప్ప, ప్రాజెక్టు
పూర్తిజేయడానికి అనిపించడం లేదు.
అరకొర నిధులు కేటాయింపులే కాదు, ప్రాజెక్టు పనుల అస్తవ్యస్థ పరిస్థితిని
జూస్తే మంత్రుల మాటలు వట్టి మాయమాటలని భావించాల్సి వస్తున్నది. మొదటి
సొరంగం దాదాపు పూర్తయింది. ఇంకా 30 మీటర్లు మాత్రమే లైనింగ్
పూర్తికావాల్సి వుంది. ఈ కొద్దిమేర లైనింగును ఎందుకు వదిలేశారో అర్థం
కావడం లేదు. రెండవ సొరంగంలో 11 కిలోమీటర్ల మేర అన్ని పనులు పూర్తయ్యాయి.
మిగిలిన 7 కిలోమీటర్లు 9 మీటర్ల కైవారానికి గానూ 7 మీటర్ల మేర మట్టి
తొలగించలేదు. మిగిలిన రెండు మీటర్ల పని జరగాల్సి ఉంది. ఈ పని పూర్తయిన
తరువాత 7 కిలోమీటర్ల లైనింగ్ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండవ సొరంగ
త్రవ్వకంలో వచ్చిన మట్టిని బయటకు తేకుండా హెడ్‌వర్క్స్ ప్రాంతంలో
డంప్‌జేశారు. అలాగే మొదటిసొరంగంలోకి 5 చోట్ల రంద్రాలు పెట్టి, దానిలో మట్టి
పోశారు. ఈ అస్థవ్యస్థ పనుల వలన ఖర్చు పెరిగిపోనున్నది. పనులు ఆలస్యం
అవుతాయి. ఒక ప్రణాళిక లేకుండా ఇలా పనులు జరగడానికి, ఖర్చు పెరగడానికి,
ఆలస్యం కావడానికి ఎవరు బాధ్యులు?
ఈ ప్రాజెక్టులో భాగమైన 53 టిఎంసిల సామర్థ్యం కలిగిన రిజర్వాయరు 2018లోనే
పూర్తయింది. 8 సంవత్సరాల పాటు నిరుపయోగంగా వున్నది. సొరంగాల నుండి
రిజర్వాయర్‌లోకి వెళ్ళే అప్రోచ్ చానల్ 2019లోనే పూర్తయింది. ఈ 5
సంవత్సరాలలో చెట్లు పెరిగి, మట్టి విరిగిపడి కాలవ దెబ్బతిన్నది. దాన్ని
మళ్ళీ వినియోగంలోకి తేవడానికి ఖర్చవుతుంది. మొదటి సొరంగాన్ని అప్రోచ్
చానల్‌కి కలిపే భాగం వదిలి వేయబడిరది. అన్నిటికన్నా ముందు ముందు
పూర్తిజేసుకోవాల్సిన హెడ్‌వర్క్స్ ఇంకా పూర్తికాలేదు. హెడ్‌వర్క్స్ నుండి
సొరంగాలను కలుపుతూజేయాల్సిన పనులు సొరంగాలు పూర్తికానందున ఇంకా మొదలే
కాలేదు. అప్రోచ్ చానల్‌కు లైనింగ్ అవసరమని చెబుతున్నారు. 22 కిలోమీటర్ల
చానల్‌కు మరమ్మత్తులు ఎప్పుడుజేస్తారు. కల్వర్టర్లు ఎప్పుడు నిర్మిస్తారు,
లైనింగ్ ఎప్పుడు వేస్తారు. అనేది అస్పష్టం.
పరిస్థితి ఇలా ఉంటే మంత్రులు ఏ ప్రాతిపదికన ప్రాజెక్టును రెండేళ్ళలో
పూర్తిజేస్తామని ప్రకటించారో నిర్దిష్టంగా వివరిస్తేనే ప్రజలకు నమ్మకం
కల్గుతుంది.
రిజర్వాయర్ నిర్మాణం మూలంగా 11 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. వారికి
ఇప్పటికీ పరిహారం పూర్తిగా చెల్లించలేదు. ప్రభుత్వం లెక్కల ప్రకారం
రూ.1,002 కోట్లు చెల్లించాల్సి వుంది. పుట్టిన గడ్డను వదిలి సర్వం
త్యాగంజేసిపోవడానికి సిద్ధమైన కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వాల మొదటి
బాధ్యత. రెండేళ్ళలో ప్రాజెక్టు పూర్తిజేయాలంటే మొదట నిర్వాసితుల సమస్యలను
పరిష్కరించాలి. అటువైపు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లే కనిపించడం లేదు.
వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యంతో పోల్చగలిగిన మరే ప్రాజెక్టుకన్నా అత్యంత
చౌకగా, తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టును ప్రభుత్వాలలో రాజకీయ చిత్తశుద్ధి
కొరవడడంతో మూడు దశాబ్దాలు ఆలస్యం అయ్యింది. వేల కోట్లు వృధాగా అదనపు వ్యయం
అయ్యింది. ఇంకా ఆలస్యం అయితే ఖర్చు ఇంకా పెరిగిపోతుంది.
ప్రభుత్వానికి వెనకబడిన, కరువు ప్రాంతాల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి వుంటే
వెలిగొండ ప్రాజెక్టును పూర్తిజేసి, వచ్చే వరద సమయానికైనా (జూలై 2025 కైనా)
రిజర్వాయర్‌లో నీరు నింపేందుకు అవసరమైన పనులను పూర్తిజేసేందుకు ప్రణాళిక
రూపొందించాలని, అందుకవసరమైన నిధులను కేటాయించాలని, పనిని పర్యవేక్షించే
ప్రత్యేక నిపుణుల బృందాన్ని నియమించాలని కోరుతున్నాను. ఇందుకోసం...
(1) నిర్వాసితులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలి.
(2) మొదటి సొరంగం మిగిలిన పనులను పూర్తిజేసి హెడ్‌వర్క్స్‌కు, అప్రోచ్
చానల్‌కు సంధానంజేసే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఆరు నెలల్లో పూర్తి
చేయాలి.
(3) అప్రోచ్ చానల్‌కు మరమ్మత్తులుజేసి వరద సీజన్ నాటికి సిద్ధంజేయాలి.
(4) 2025 వరద సీజన్‌లో రిజర్వాయర్‌ను నింపాలి.
(5) అనంతరం రెండవ సొరంగ పనులను, పంటకాల్వలను రెండవ దశలోని మిగిలిన పనులను
నిర్ణీత సమయంలో పూర్తిజేయాలి.
పైన పేర్కొన్న మా సూచనలను పరిశీలించాలని కోరుతున్నాను.
అభివందనములతో..
.
(బి.వి.రాఘవులు)
సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org