భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 నవంబర్, 2024.
అదానీ కంపెనీతో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి.
అదానీని అరెస్టు చేయాలి.
నిరసనలకు సిపిఐ(యం) పిలుపు
సెకీ నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు అదానీ
గ్రూపు భారీ ముడుపులు చెల్లించిన నేపథ్యంలో రాష్ట్రంలో అదానీ గ్రూపు కంపెనీ
చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర
కమిటీ డిమాండ్ చేస్తున్నది.
2019`20 మధ్య సెకి ఒప్పందమే గాక రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజి విద్యుత్
ప్లాంట్లు, విశాఖలో డేటా సెంటర్, గంగవరం పోర్టు వంటి వివిధ ప్రాజెక్టులను
అదానీ గ్రూపు సంస్థలతో నాటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వ
ఆస్తులను, ప్రజల సంపదను వారికి ధారాదత్తం చేసింది.
అదానీ గ్రూపు అక్రమాలకు నిరసనగా అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ
ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేయాలని సిపిఐ(యం)
పిలుపునిస్తున్నది. ఈ నిరసన ప్రదర్శనల్లో ప్రజలు పాల్గొని జయప్రదం
చేయాల్సిందిగా కోరుతున్నది.
డిమాండ్స్ :
(1) అదానీ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ
రద్దు చేసుకోవాలి.
(2) వారికి కేటాయించిన భూముల్ని, ప్రజల సంపదను వెనక్కి తీసుకోవాలి.
(3) విశాఖ డేటా సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి.
(4) లంచాలు తీసుకున్న అవినీతిపరుల పేర్లు, వివరాలను అమెరికా ప్రభుత్వం
నుండి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా దౌత్యపరమైన చర్యలు వెంటనే
చేపట్టాలి.
(5) అమెరికా న్యాయ స్థానాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానిపై కేసు నమోదు
చేయాలి. వెంటనే కేసు నమోదు చేసేటట్లు సిబిఐని ఆదేశించాలి.
(6) గౌతమ్ అదానీని, ఇతర నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
(7) అదానీ గ్రూపు అక్రమాలను వెలికితీసేందుకు స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ
జరపాలి.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి వ్రాసిన లేఖను
ఇందువెంట జతచేస్తున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : సెకి నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్ కొనుగోలు ఒప్పందం
చేసుకునేందుకు అదానీ గ్రూపు భారీ ముడుపులు చెల్లించిందని అమెరికా కోర్టులో
వ్యాజ్యం నమోదు నేపథ్యంలో... ఈ అంశంపై సిటింగ్ న్యాయమూర్తితో విచారణ
జరపాలని- ఈలోగా అదానీ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల
రద్దు, గౌతమ్ అదానీని, ఇతర నిందితుల అరెస్టుకు ... అలాగే ముడుపులు పొందిన
వారి పేర్లు, వివరాలను అమెరికా ప్రభుత్వం నుండి తెప్పించడానికి దౌత్యపరమైన
చర్యలు చేపట్టాలని కోరుతూ...
అయ్యా!
గౌతమ్ అదానీ, మరో ఏడుగురు నిందితులు ‘సెకి’ నుండి ఆంధ్రప్రదేశ్
డిస్కాములు 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేయడానికి 2019`24
మధ్య అధికారంలో వున్న వారికి 1750 కోట్లు ముడుపులు చెల్లించినట్లు
అమెరికాలోని తూర్పు న్యూయార్క్ జిల్లా కోర్టులో ( సిఆర్ నెం.24` సిఆర్`
433, తేదీ 2024 అక్టోబర్ 24) కేసు నమోదైంది.
సెకి నుండి విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర డిస్కాములు చేసుకున్న ఒప్పందం
రాష్ట్రానికి నష్టదాయకమని తొలి నుండి సిపిఎం ీ వ్యతిరేకించడం, దాన్ని రద్దు
చేయాలని కోరడం జరుగుతోంది. విద్యుత్ నియంత్రణ మండలి జరిపిన పబ్లిక్
హియరింగ్‌లలో మా పార్టీ ప్రతినిధులు ఆయా సందర్భాల్లో ఈ అంశాన్ని
లేవనెత్తుతూనే ఉన్నారు. అంతేగాక ప్రస్తుత ఆర్థిక మంత్రి, నాడు
ప్రతిపక్షంలోనున్న పయ్యావుల కేశవ్ ‘సెకి’తో ఒప్పందాన్ని తీవ్రంగా
వ్యతిరేకించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాము. సదరు ఒప్పందాన్ని విద్యుత్
ఉద్యోగులు, సాధారణ ప్రజలు కూడా వ్యతిరేకించారు.
2019`20 మధ్య సెకి ఒప్పందమే గాక రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజి విద్యుత్
ప్లాంట్లు, విశాఖలో డేటా సెంటర్, గంగవరం పోర్టు వంటి వివిధ ప్రాజెక్టులను
అదానీ గ్రూపు సంస్థలతో నాటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వ
ఆస్తులను, ప్రజల సంపదను వారికి ధారాదత్తం చేసింది.
అదానీ గ్రూపు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని గతంలో హిండెన్‌బర్గ్
నివేదిక కుండబద్దలు కొట్టింది. అధికారంలో వున్న వారికి భారీగా ముడుపులు
చెల్లించిందని ఇప్పుడు ఏకంగా కోర్టులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర
ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
(1) అదానీ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ
రద్దు చేసుకోవాలి.
(2) వారికి కేటాయించిన భూముల్ని, ప్రజల సంపదను వెనక్కి తీసుకోవాలి.
(3) విశాఖ డేటా సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి.
(4) లంచాలు తీసుకున్న అవినీతిపరుల పేర్లు, వివరాలను అమెరికా ప్రభుత్వం
నుండి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా దౌత్యపరమైన చర్యలు వెంటనే
చేపట్టాలి.
(5) గౌతమ్ అదానీని, ఇతర నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
పై చర్యలు తీసుకోవడం ద్వారా మీ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు కట్టుబడి
వున్నట్లు రుజువు చేసుకుంటుందని ఆశిస్తున్నాను. తద్వారా రాష్ట్ర సంపదను
కాపాడాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి