(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)
విజయవాడ,
తేది : 15 నవంబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 శాసనసభలో ఆమోదించడానికి ముందు
అన్ని పక్షాలతో సంప్రదించాలని కోరుతూ...
అయ్యా!
భూదురాక్రమణ నిషేద బిల్లు 2024లో కొన్ని అంశాలు పేదలపైన, పేదలపక్షాన
నిలబడే ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయి. వాటిని
తొలగించి అక్రమంగా, దౌర్జన్యంగా ఆక్రమించుకొన్న దురాక్రమణదారులకు శిక్ష
విధించేలా, పేదలకు న్యాయం చేకూర్చేలా ఈ చట్టాన్ని సవరించాలని కోరుతున్నాను.
మన రాష్ట్రంలో భూ దురాక్రమణలు సంకటమైన సమస్యగా ఉందని, అనేకమంది భూ
యజమానులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారని అంతేగాకుండా పట్టణీకరణ,
వ్యాపారీకరణ మరియు పారిశ్రామికీకరణ ప్రాధమిక ఉత్ప్రేరకాలుగా ఉన్నాయని ఈ
నేపథ్యంలో భూదురాక్రమణను అరికట్టడానికి 1982 చట్టాన్ని రద్దుచేసి ఆస్థానంలో
భూదురాక్రమణ నిషేధ చట్టం 2024ను నిన్న శాసనసభలో ప్రవేశపెట్టారు.
గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తరహాలో ఈచట్టం చేయాలని
ప్రయత్నించి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. మీరు దాన్నే కొనసాగించడం
సముచితం కాదు. కాబట్టి ఈ బిల్లు చట్టరూపం తీసుకోకముందే వ్యవసాయ కార్మిక,
రైతు సంఘాలతో సహా అఖిలపక్ష సమావేశం జరిపి అభిప్రాయాలు తీసుకొని తుదిరూపం
ఇవ్వాలని కోరుతున్నాను.
రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్టలోపు స్వంత భూములు కలిగిన పేద,
మధ్యతరగతి రైతులు, స్వంత ఇల్లు లేని పట్టణ, గ్రామీణ పేదలు ప్రభుత్వ భూమి
కలిగి వుంటే వారికి ఈ చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాను.
ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను దౌర్జన్యంగా, అక్రమంగా దురాక్రమణ
చేసిన పలుకుబడి కల్గిన రాజకీయ నాయకులు, సంపన్నులపై ప్రభుత్వం చర్యలు
తీసుకోవాలి. దానికి మాపార్టీ నుండి సంపూర్ణ మద్దతు ఉంటుంది. కాని 2024
చట్టం (బిల్) అందుకు ఉద్దేశించినట్లుగా కనిపించడం లేదు. బిల్లులోని
అంశాలను పరిశీలిస్తే పై భూకబ్జాదారులకంటే కూడా రాష్ట్రంలో రెక్కల కష్టం
మీదే ఆధారపడి జానెడు స్వంత ఆస్తి లేని దళితులు, బలహీన వర్గాలకు చెందిన
పేదలు ఎక్కడైన ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుంటున్న,
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో సాగు చేసుకోవడానికి ఉపక్రమిస్తున్న పేదలపై
బ్రహ్మాస్త్రం ప్రయోగించేటట్లు ఈ చట్టంలో కొన్ని అధ్యయనాలు పరిశీలిస్తే
అర్థమవుతుంది. పేదలను, వారికి అండగా ఉన్న ప్రజా ఉద్యమకారులను అణచివేసి,
భూమాఫియాను ప్రోత్సహించేదిగా ఈ చట్టం ఉన్నట్టు అర్థమవుతుంది.
నాలుగు దశాబ్ధాలు అనుభవం, ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలుదురాక్రమణ చేసిన
భూమాఫియాలు ఏఒక్కరిపైనా చర్య తీసుకోలేదు, ఒక్క దళితుడికి తిరిగి భూమి
అప్పజెప్పలేదు. ఇప్పుడు మీరు తీసుకువస్తామన్న చట్టం పరిశీలిస్తుంటే
పట్టణీకరణ పెరగడం, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక అభివృద్ధి అనే పేరుతో
నగరాలకు, మండల కేంద్రాలకు ఆనుకుని ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విలువైన
భూములను బడా పెట్టుబడిదారులకు, సంపన్నులకు, రాజకీయ నాయకులకు
కట్టబెట్టడానికే ఈ తరహా చట్టం తోడ్పడుతున్నట్లు గుజరాత్ అనుభవం
తెలియజేస్తున్నది. అందువల్ల పేదలకు న్యాయం జరిగే విధంగా ఈ చట్టాన్ని
సవరించాలి.
మీ పరిశీలన కోసం బిల్లులో కొన్ని అభ్యంతరకరమైన అంశాలను ఈ క్రింద
పేర్కొంటున్నాను
సెక్షన్ - 2 (డి, ఇ)లో భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొనుటకు లేదా
నిర్మాణములను చేపట్టుటకు ఎవరైనా ప్రభుత్వ, దేవాలయ, వక్ఫ్ ప్రైవేట్
భూములను స్వాధీనం చేసుకొంటే వారికి 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష,
మార్కెట్ రేటు ప్రకారంగా పరిహారం చెల్లించాలని పొందుపరిచారు. అదేవిధంగా
ఎవరైనా పెద్దలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిని ఇతరులకు కౌలుకు
ఇస్తే తెలిసో, తెలియక ఆ భూమిని కౌలుకు తీసుకున్న దళితులు, బలహీన వర్గాల
పేదలు కూడా దోషులే అని వీరికి కూడా జైలు శిక్ష విధిస్తామని చెప్పారు.
ఈ లెక్కన తలదాచుకోవడానికి జానెడు స్థలం లేని పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో
పొట్టపోసుకోవడానికి ప్రభుత్వ భూములను సాగు చేసుకోవడానికి ఉపక్రమించిన పేదలు
కూడా భూఆక్రమణదారులే అవుతారు. వారికి కూడా శిక్షలు విధిస్తారు. ఇది
పిచ్చుకుల పై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం లాంటిదే.
సెక్షన్ -4లో (1) ఏ వ్యక్తులైనా, ఏ వ్యక్తైనా ఇతరులచే భూ దురాక్రమణ
చేయరాదు. చేయించరాదు. అని చెప్పారు.
ఈ సెక్షన్ ప్రకారంగా నిరుపేదల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రజా
ఉద్యమకారులను, పేదల తరపున మాట్లాడే సంఘాల, పార్టీల కార్యకర్తలపై కక్షగట్టి
శిక్ష విధించి ప్రజా ఉద్యమాలను అణచడానికి విధించినదిగా ఉంది. కాబట్టి ఈ
సెక్షన్‌ని ఎత్తివేసి సంపన్నులను, పలుకుబడికల్గిన అనర్హులకు శిక్ష
విధించేలా మార్పులు చేయాలి.
సెక్షన్ -5లో (4) పలుకుబడిన కల్గినవారు ఆక్రమించుకొని ఆ స్థలంలో నిర్మాణం
చేపట్టే భవనాలలో కడుపుకూటి కోసం పని చేసే కార్మికుల పైన చర్యలు
తీసుకోవడమనేది అత్యంత దుర్మార్గమైనది. దీనిని పూర్తిగా ఎత్తివేయాలి.
సెక్షన్ -6లో (1) పెట్టుబడిదారులు ఆక్రమించుకుంటే మేనేజ్‌మెంట్‌కు
తెలియకుండా ఆక్రమణ జరిగిందని యాజమాన్యం నిరూపిస్తే శిక్ష నుండి మినహాయింపు
ఇచ్చారు. దీనిని బట్టి పేదలపై ఉక్కుపాదం మోపి పెట్టుబడిదార్లకు చట్టబద్దం
ఇచ్చే ఈ మినహాయింపు దురాక్రమణదారుల్ని ప్రోత్సహించడమే. దురాక్రమణకు
యజమానుల్ని బాధ్యుల్ని చేయాలి.
సెక్షన్-7లో (2) న్యాయస్థానం 6నెలల్లో పరిష్కారం చేయకపోతే తిరిగి రాష్ట్ర
ప్రభుత్వానికి అప్పచెప్పాలన్నారు. న్యాయస్థానం నుండి తప్పించడం అధికారంలో
ఉన్న పార్టీ నాయకుల ఇష్టాయిష్టాల ప్రకారం ప్రజలకు అన్యాయం జరుగుతోంది.
దీనిని రద్దు చేయాలి.
పై విషయాలను పరిశీలించిన తర్వాత 1982లో తెచ్చిన భూ ఆక్రమణ నిషేధ చట్టం
పరిశీలించినా, 9/77 అసైన్డ్ (భూ బదలాయింపు నిషేధం) చట్టం పరిశీలించినా,
కోనేరు రంగారావు భూ కమిటి సిఫార్సులు పరిశీలించినా గడిచిన నాలుగు దశాబ్ధాల
కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో అక్రమంగా, దౌర్జన్యంగా, రాజకీయ పలుకుబడితో
ప్రభుత్వ, పేదల భూములను ఆక్రమించిన ఒక్కరిపై ఈరోజు వరకు ఏ ప్రభుత్వం చర్య
తీసుకోలేదు, జైలుకు పంపలేదు. తద్విరుద్దంగా పేదలకు వారి పక్షాన నిలబడిన
ఉద్యమకారులనే జైలుకు పంపిన ఘటనలున్నాయి.
అదేవిధంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సభలు జరిపి
అన్యాక్రాంతమైన పేదల భూములను బయటికి తీసి తిరిగి పేదలకు ఇస్తాము,
అనర్హులపై చర్య తీసుకుంటామని చెప్పారు. కాని నేటికి ఒక్క పేదవాడికి భూమి
దఖలు పరచలేదు.
కాబట్టి మేము చేసిన పై సూచనలు పరిగణలోకి తీసుకొని ఈ చట్టంలో మార్పులు
తీసుకువస్తారని ఆశిస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి