రాష్ట్రంలో భూకుంభకోణాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 అక్టోబరు, 2024.

 

రాష్ట్రంలో భూకుంభకోణాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

-సిపిఐ(యం)

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన, ఫ్రీ హోల్డ్‌కి మార్చిన, ఇతర అన్ని రకాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూవివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

రాష్ట్రంలో అక్రమంగా, దౌర్జన్యంగా వేలాది ఎకరాల పేదల భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనాయి. అనేక చోట్ల పేదలు పోరాడుతున్నారు. జగనన్న ఇళ్ల కాలనీల పేరిట భూసమీకరణలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి వందలాది ఎకరాల పేదలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఏఎస్‌ ఉన్నత అధికారితో విచారణకు ఆదేశించింది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని ముఖ్యమంత్రి ఉన్నత అధికారులతో సమీక్షలు చేసి ఆగష్ట్టు ఐదు నాటికి అన్ని జిల్లా కలెక్టర్లు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. మూడు మాసాలవుతున్నా ఈ విషయమై పురోగతి లేదు. పార్టీల, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ, పేదల భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని మార్క్సిస్టు పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.  

2017లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ పరిసర ప్రాంతాలలో 12 మండలాలలో ప్రభుత్వ భూమి, పేదల భూమి వేలాది ఎకరాలు ఆక్రమణ, టాంపరింగ్‌కు గురి అయ్యాయని 2018 జనవరిలో సిట్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఇప్పటివరకూ బయట పెట్టలేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా 2019 వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక సిట్‌ని వేసింది. ఈ నివేదికను వైసిపి ప్రభుత్వం బయట పెట్టలేదు. 49 మంది ఉన్నతాధికారులకు ఇందులో పాత్ర ఉన్నట్లు చెప్పినా ఎటువంటి చర్య తీసుకోలేదు. 

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పట్టణాలు, నగరాల్లో స్థానిక శాసనసభ్యులు, వారి బంధువులు, అనుయాయులు భూములు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సిపిఎం, వామపక్షాలు మరియు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వాటిపై ఆందోళన చేసినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

రాష్ట్ర ప్రభుత్వం 2 సిట్‌ నివేదికలను వెంటనే బహిరంగపర్చాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి కోరుతోంది.  అలాగే ఆక్రమణకు గురైనటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడే భూమిలేని దళితులకు, పేదలకు  పంచాలని, ఆక్రమణకు పాల్పడినవారు ఎంతటి వారైనా, సంబంధిత ఉన్నత అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి