
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 అక్టోబర్, 2024.
ఇసుకపై ప్రయివేటు పెత్తనం వద్దు
ఇసుక రీచ్‌ల నిర్వహణ, తవ్వకాలు, స్టాక్ యార్డుల నిర్వహణ, సరఫరా వంటి కీలక బాధ్యతలను ప్రయివేటు ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
ఉచిత ఇసుక విధానానికి సవరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం.66తో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలు పరిశీలిస్తే ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవడానికి, ప్రైవేటుకు పెద్దపీట వేసేందుకే ఈ జి.వో.ను తీసుకువచ్చినట్లు కనబడుతున్నది. ఇసుక రీచ్‌ల నిర్వహణ, తవ్వకాలు, స్టాక్‌యార్డు నిర్వహణ, సరఫరా వంటి బాధ్యతలను ప్రయివేటు వాళ్ళకు అప్పగించి ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహించేలా ఉండడం గర్హనీయం.
ఇప్పటికే పలుసార్లు ఇసుక విధానంలో మార్పు చేసినా సాక్షాత్తూ ముఖ్యమంత్రి బహిరంగంగా అధికార పార్టీ నాయకులను హెచ్చరించినా వినియోగదార్లకు ఇసుక లభ్యత, ధర విషయంలో ఎటువంటి ఉపశమనమూ లేదు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇసుక దందాలో ప్రధాన పాత్రదారులన్నది బహిరంగ రహస్యం.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకొచ్చిన సవరణలు సాధారణ వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగపడకపోగా అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. జి.వో.లో పేర్కొన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీల పేరుతో ఉచిత ఇసుక నిర్వహణ, ధరల నిర్ణయం, నిఘా, నియంత్రణ మొదలగు ముఖ్యమైన విషయాలపై అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల పెత్తనం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
వినియోగదారులే ఇసుక రీచ్‌లకు వెళ్ళి తవ్వించుకొని, లోడ్ చేయించుకోవాలని, అలా చేయలేకపోతే ప్రయివేటు వారికి ఆపరేషన్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతో పాటు ఇతర రుసుములు చెల్లించాలని స్పష్టం చేసింది. దీనివలన పేరుకు మాత్రమే ‘‘ఉచిత ఇసుక’’ కానీ ఆచరణలో రకరకాల పేర్లతో వినియోగదారులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో ఉచిత ఇసుక పథకం నామమాత్రంగా మారే ప్రమాదం ఉంది. కావున ప్రయివేటు ఏజెన్సీలకు కాకుండా ఇసుక సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. నదులు, వాగుల సమీపంలోని వినియోగదార్లు బండ్లు, ట్రాక్టర్లతో తమ సొంతానికి ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే స్వేచ్ఛ కొనసాగించాలనీ, వారిపై ఎలాంటి వేధింపులూ లేకుండా చూడాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి