
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 26 అక్టోబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఎసిసి - కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు గత 32 సంవత్సరాలుగా చెల్లించని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...
అయ్యా,
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గ పరిధిలోని తాడేపల్లి మండలం ఎసిసి కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ 1993 మే 29న అక్రమ లాకెట్ జరిగింది. 32 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు నష్టపరిహారం అందలేదు. పనిచేసిన 1993 మే నెల జీతం కూడా ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం అవుతోంది. 333 మంది కార్మికులకు గాను 160 మంది చనిపోయారు. కార్మికుల కుటుంబాలు దీనావస్థలో ఉన్నారు.
కలకత్తా కోర్టు ద్వారా సిమెంట్ కంపెనీ ఆస్తులు 2003లో బాలభాను ఎంటర్‌ప్రైజెస్ మరియు ఎన్‌ఆర్‌ఐ నామినల్ రేట్‌కు వేలం ద్వారా దక్కించుకున్నారు. వేలం ద్వారా దక్కించుకున్న కంపెనీలు, సిమెంట్ కంపెనీ బకాయిలు చెల్లించాలనే వేలం కండీషన్ అమలు చేయలేదు. కార్మికులకు నష్ట పరిహారం అందలేదు.
దీనిపై 2015లో సెంట్రల్ లేబర్ కోర్టు, హైకోర్టు, వడ్డీతో సహా నష్టపరిహారం కార్మికులకు చెల్లించమని ఆర్డర్స్ ఇచ్చాయి. అయినా నేటికీ అమలు కాలేదు. పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేదు.
ఫ్యాక్టరీకి చెందిన భూములు నాడు 10 కోట్లకు కొన్నారు. నేడు దాని విలువ 2 వేల కోట్లకు పైగా ఉంది. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారుగా రూ.43 కోట్లు మాత్రమే. అయినా చెల్లించలేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కార్మికులకు నష్టపరిహారం అందలేదు. పరిహారం చెల్లించని యెడల ఆ భూముల్ని కార్మికుల పరం చేయాలని వారు కోరుతున్నారు.
కావున కార్మికులకు నష్టపరిహారం అయినా చెల్లించాలి లేదా సదరు కొనుగోలు చేసిన కంపెనీ నుండి భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కార్మికులకు నష్టపరిహారం క్రింద చెల్లించాలని కోరుతున్నాను. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత మంత్రిగా ఉన్న శ్రీ లోకేష్ గారు కార్మికులకు న్యాయ చేస్తామని హామీ ఇచ్చియున్నారు. కావున మీరు కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి