విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 అక్టోబర్‌, 2024.

విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించాలి
        ఎఫ్‌పిపిసిఎ చార్జీల పేరిట ప్రజలపై రూ. 6,072 కోట్ల భారాన్ని విధిస్తూ ఎపి
విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ నేడిచ్చిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించాలని
సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే ధరల పెరుగుదల, మరోవైపున
ఉపాధి సన్నగిల్లి ఆదాయాలు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇలా
విద్యుత్‌ భారం మోపడం అమానుషం. ఏనాడో వాడిన కరెంటుకు ఏళ్లు గడిచిపోయాక
అదనంగా చార్జీలు చెల్లించాలన్న ఈ ఎఫ్‌పిపిసిఎ (ట్రూఅప్‌) విధానం
మోసపూరితమైనది. ప్రపంచ బ్యాంకు ఆదేశిత విద్యుత్‌ సంస్కరణల్లోని
దుర్మార్గమైన షరతుల్లో ఇది ముఖ్యమైనది. 2022-23లో వాడిన కరెంటుకు ఈ నవంబర్‌
నెలనుండి 2026 జనవరి వరకు కొన్ని నెలల్లో యూనిట్‌కు దాదాపు 83 పైసల వరకూ
అదనంగా చెల్లించాలని తాజా ఉత్తర్వు. ఇది విద్యుత్‌ వినియోగదార్లందరికీ
కష్టమే కాదు, నిరుపేదలకు పెను భారం కూడా అవుతుంది. ఉదాహరణకు నెలకు 30
యూనిట్లకన్నా తక్కువగా వాడేవారు ఇప్పుడు యూనిట్‌కు ఒక రూపాయి తొంభై పైసల
చొప్పున చెల్లిస్తుండగా ఇకపై రూ2.73 పైసల చొప్పున చెల్లించాలి. అంటే వారికి
44 శాతం పెరుగుదలన్నమాట!
        అధికారానికి వస్తే ‘విద్యుత్‌ చార్జీలు నియంత్రిస్తాం’, ‘విద్యుత్‌
బిల్లుల భారం తగ్గిస్తాం’ అని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చిన టిడిపి
కూటమి ప్రభుత్వం తగ్గించడం సంగతలా ఉంచి ఇప్పుడు అమాంతం 44 శాతం పెంపుదలకు
పూనుకోవడం దారుణం. షార్ట్‌టర్మ్‌ కొనుగోళ్ళ పేరుతో గత ప్రభుత్వం అనుసరించిన
తప్పుడు విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించడం గర్హనీయం. మాటతప్పి ప్రజలపై
వేసిన ట్రూఅప్‌ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని
సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తోంది. విద్యుత్‌ చార్జీల పెంపుదలను నిరసించాలని
ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి