విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విఆర్‌ఎస్‌ స్కీమ్‌ ప్రతిపాదన విరమించుకోవాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 అక్టోబర్‌, 2024.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విఆర్‌ఎస్‌ స్కీమ్‌ ప్రతిపాదన విరమించుకోవాలి
        స్టీల్‌ప్లాంట్‌లో సర్వే పేరుతో ఉద్యోగులకు వి.ఆర్‌.ఎస్‌. ఇచ్చి
సాగనంపడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
విశాఖస్టీల్‌ యాజమాన్యం వి.ఆర్‌.ఎస్‌. స్కీమ్‌ ప్రతిపాదనను వెంటనే
విరమించుకోవాలి. ఉద్యోగులందరూ వి.ఆర్‌.ఎస్‌. స్కీమ్‌ను పూర్తిగా
వ్యతిరేకించాలని, కేంద్ర ప్రభుత్వం మోసపూరిత ట్రాప్‌లో పడకూడదని విజ్ఞప్తి
చేస్తున్నాము. కార్మికుల పోరాట ఫలితంగా రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌
తెరుస్తున్న సమయంలో ఈచర్య ఉత్పత్తిని దెబ్బకొడుతుంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి తగ్గించి
విశాఖస్టీల్‌ను నష్టాల్లోకి నెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. గత
మూడేళ్ల నుంచి ఉత్పత్తి తగ్గించింది. గత రెండేళ్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో
నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గించడమే దీనికి ప్రధాన కారణం.
ఉత్పత్తి పెంచడం ద్వారా నష్టాలను పూడ్చడానికి మంచి అవకాశాలున్నాయి. 
ఉద్యోగులకు వి.ఆర్‌.ఎస్‌. ఇచ్చి బయటకు పంపడం ద్వారా ఉత్పత్తి ఎలా
పెంచుతారు. గత ఐదేళ్ల నుంచి రిటైర్డ్‌ అయిన పర్మినెంట్‌ ఉద్యోగులు,
ఆఫీసర్లు ఐదు వేలకు పైగా ఉన్నారు. ప్రతి సంవత్సరం జరగాల్సిన
రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదు. పైగా వి.ఆర్‌.ఎస్‌.తో బలవంతంగా కార్మికులను
బయటకు నెట్టడం దారణమైన చర్య. కేంద్ర ప్రభుత్వం విశాఖస్టీల్‌ ప్రైవేటీకరించే
చర్యల్లో భాగంగానే వి.ఆర్‌.ఎస్‌.ను ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం
చేస్తున్నదని స్పష్టంగా అర్ధమవుతున్నది.
సెయిల్‌లో విలీనంచేసే ప్రయత్నాలు చేయకుండా మరోవైపున వి.ఆర్‌.ఎస్‌.ను
ప్రవేశపెట్టడాన్ని కార్మికులు ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం వి.ఆర్‌.ఎస్‌. చర్యలను విరమింపచేసేందుకు కేంద్ర
ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నాం.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి