బెల్టు షాపులను అరికట్టండి - మద్యపానాన్ని నియంత్రించండి. స్థానికులు వ్యతిరేకించిన చోట మద్యం షాపులను పెట్టవద్దు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 అక్టోబర్‌, 2024.

 

బెల్టు షాపులను అరికట్టండి - మద్యపానాన్ని నియంత్రించండి.

స్థానికులు వ్యతిరేకించిన చోట మద్యం షాపులను పెట్టవద్దు.

-సిపిఐ(ఎం) డిమాండ్‌

రాష్ట్రంలో 3,396 మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు, కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం లాటరీ ద్వారా కేటాయించింది. ఈ షాపులు జనావాసాల మధ్య, స్కూళ్ళు, దేవాలయాలకు దగ్గరలో జన సమృద్ది ఉన్న ప్రాంతాలలో పెడుతున్నారు. పలు ప్రాంతాలలో మహిళలు, స్థానిక ప్రజలు వీటిని ప్రతిఘటిస్తున్నారు. అందువలన నిబంధనల ప్రకారం జనావాసాలకు దూరంగా షాపులను పెట్టుకోవాలి. ప్రజలు ప్రత్యేకించి మహిళలు వ్యతిరేకించిన చోట పెట్టకుండా నిబంధనలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాము. వారానికి ఒక రోజు డ్రై డేగా ప్రకటించాలని కోరుతున్నాము. 

కొత్తగా షాపులు పొందిన కాంట్రాక్టర్లు అడ్డగోలు లాభార్జన కోసం ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా,  ప్రైవేటుగా, అనధికారికంగా వేలం పాటలు నిర్వహించి బెల్ట్‌ షాపులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. బెల్టు షాపులతో సహా మద్యం ఆదాయంలో అధికార పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కూడా వాటాలు పెడుతున్నట్లు రాష్ట్రం నలుమూలల నుండి సమాచారం అందుతున్నది. బెల్ట్‌ షాపుల వల్ల మద్యపానం వినియోగం పెరగడమే కాకుండా నియంత్రణ లేని మద్యం అమ్మకాలు సాగుతాయి. జనం అప్పుల పాలవుతారు. మహిళలు వేధింపులకు గురవుతారు. అల్లరి మూకలు పెట్రేగి పోతాయి. అందువల్ల బెల్ట్‌ షాపులను ఎక్కడకక్కడ కట్టడి చేయాలి. ప్రజల ఫిర్యాదులకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వీటిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తున్నాము.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి